Share News

Minister Satyakumar: పదోన్నతుల్లో ఆరోగ్యశాఖ రికార్డు

ABN , Publish Date - Sep 02 , 2025 | 07:26 AM

ఆరోగ్యశాఖలో 2024-25 సంవత్సరం పదోన్నతుల పండుగగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యశాఖ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ ప్యానల్‌ ఇయర్‌లో దాదాపు 600 మంది వైద్యులు, మరో వంద మందికిపైగా అధికారులకు పదోన్నతులు లభించాయి.

Minister Satyakumar: పదోన్నతుల్లో ఆరోగ్యశాఖ రికార్డు

  • 600 మంది వైద్యులు.. వంద మందికిపైగా అధికారులకు

  • డీఎంఈలో 217, డీఎస్‌హెచ్‌లో 321 మందికి ప్రమోషన్‌

  • తొలిసారి పారదర్శకంగా అర్హులకు పదోన్నతులు, పోస్టింగ్స్‌

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆరోగ్యశాఖలో 2024-25 సంవత్సరం పదోన్నతుల పండుగగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యశాఖ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈ ప్యానల్‌ ఇయర్‌లో దాదాపు 600 మంది వైద్యులు, మరో వంద మందికిపైగా అధికారులకు పదోన్నతులు లభించాయి. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ), డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌(డీఎ్‌సహెచ్‌), డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌(డీహెచ్‌), ఆయుష్‌ విభాగం, డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇలా ప్రతి విభాగంలో వైద్యులకు, సిబ్బందికి పదోన్నతులు లభించాయి. చివరికి 20 ఏళ్ల నుంచి పదోన్నతులకు నోచుకొని గ్రూప్‌-1 అధికారులకు కూడా డిప్యూటీ డైరెక్టర్‌ నుంచి జూయింట్‌ డైరెక్టర్‌గా పదోన్నతులు లభించాయి. డ్రగ్స్‌ విభాగంలో కూడా ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్‌ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించారు. డీఎంఈ చరిత్రలోనే 13 మంది సీనియర్‌ ప్రొఫెసర్లకు అదనపు డైరెక్టర్లు(ఏడీ)గా పదోన్నతులు కల్పించారు. వీరితోపాటు డీఎంఈలో ఈ ఏడాది 217 మంది వైద్యులు పదోన్నతి పొందారు. అసోసియేట్‌ ప్రొఫెసర్లు 96 మంది ప్రొఫెసర్లుగా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 108 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా ప్రమోట్‌ అయ్యారు. బోధన అనుభవం ఉన్న అసోసియేట్‌కు ప్రొఫెసర్లుగా తొలిసారి అవకాశం కల్పించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది.


తద్వారా 150 మందికిపైగా వైద్యులు లబ్ధి పొందారు. సీఎం చంద్రబాబు ఆమోదంతో వీరికి పదోన్నతులు లభించాయి. ఈ మినహాయింపు ఇవ్వకపోతే వీరందరికీ పదోన్నతులు రావాలంటే దాదాపు నాలుగేళ్ల సమయం పట్టేది. డీఎ్‌సహెచ్‌లోనూ 321 మంది వైద్యులకు పదోన్నతులు కల్పించారు. వీరిలో 34 మంది సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టులు, 78 మంది డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టులు, 109 మంది డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ జనరల్‌గా పదోన్నతులు పొందారు. మరో 100 మంది డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నుంచి డిప్యూటీ డెంటల్‌ సర్జన్లుగా పదోన్నతి పొందారు. డీహెచ్‌లోనూ సీనియర్‌ వైద్యులకు సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌లుగా, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌లుగా పదోన్నతులు లభించాయి. తద్వారా ఈ ఏడాది పదోన్నతుల్లో ఆరోగ్యశాఖ రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు. గతంలో పదోన్నతులు, పోస్టింగ్స్‌ అంటే భారీగా పైరవీలు, ముడుపుల వ్యవహారం నడిచేది. ఈ ప్యానల్‌ ఇయర్‌లో అవేమీ లేవు. కేవలం అర్హతే ప్రామాణికంగా పారదర్శక వాతావరణంలో పదోన్నతులు కల్పించి, పోస్టింగ్స్‌ ఇచ్చారు.


గతంలో పదోన్నతుల్లో అన్యాయం

గతంలో పదోన్నతుల విషయంలో ఆలస్యం జరిగినట్లు ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో నిర్ణీత సమయంలో అర్హులైన వైద్యులందరికి పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించా. ప్రజారోగ్య పరిరక్షణలో ఆరోగ్యశాఖ వైద్యులు, సిబ్బంది పాత్ర చాలా కీలకం. క్లిష్టమైన సేవలందిస్తున్న అందరికీ పదోన్నతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. గత ప్రభుత్వం దీనిని విస్మరించింది.

-సత్యకుమార్‌, ఆరోగ్య మంత్రి

Updated Date - Sep 02 , 2025 | 07:26 AM