Minister SatyaKumar: ఆరోగ్య రంగం బలోపేతానికి కృషి
ABN , Publish Date - Jul 16 , 2025 | 06:19 AM
రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు విశేషంగా కృషిచేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ చెప్పారు.
సైకియాట్రీలో ఎమ్మెస్సీ, డిప్లమో కోర్సులు
క్లినికల్ సైకాలజీలో 30 సీట్లతో ఎంఫిల్
విమ్స్‌ను నిమ్స్ స్థాయికి తీసుకెళ్తా: మంత్రి సత్యకుమార్
విశాఖపట్నం, జూలై 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు విశేషంగా కృషిచేస్తున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పెదవాల్తేరులోని మానసిక వైద్యశాల ఆవరణలో రూ.29.7 కోట్లతో నిర్మించిన భవనాలను, భానోజీనగర్‌లో రూ.1.38 కోట్లతో నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (యూపీహెచ్‌సీ)ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి సైకియాట్రీ విభాగంలో ఎమ్మెస్సీ లేదా డిప్లమో, క్లినికల్ సైకాలజీలో 30 సీట్లతో ఎంఫిల్ కోర్సులు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. విమ్స్‌ను నిమ్స్ స్థాయికి తీసుకువెళతామన్నారు. దేశంలో ప్రతి లక్ష మందికి ముగ్గురు మానసిక వైద్యులు కావాల్సి ఉండగా, 0.7 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యే విష్ణు సూచన మేరకు మానసిక వైద్యశాల పేరు మార్పుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ మానసిక వైద్యంలో నాణ్యత పెరగాలన్నారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.