Anagani Satya Prasad: 130 గ్రామాల్లో భూ సమస్యలు
ABN , Publish Date - Jul 27 , 2025 | 04:50 AM
రాష్ట్రంలో 130 గ్రామాల్లో భూ సమస్యలు ఉన్నాయని, వాటిపై ప్రభుత్వానికి అక్టోబరు నాటికి ఓ నివేదికను అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
జిల్లాల పునర్విభజన చేస్తాం: మంత్రి సత్య ప్రసాద్
నరసాపురం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 130 గ్రామాల్లో భూ సమస్యలు ఉన్నాయని, వాటిపై ప్రభుత్వానికి అక్టోబరు నాటికి ఓ నివేదికను అందిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో కొన్ని భూములు వెబ్‌ల్యాండ్‌లో చూపించని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కారణంగా రిజిస్ట్రేషన్లు జరగడం లేదని రైతుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ఇలాంటి సమస్యల్ని పరిష్కరించాలని జిల్లా యాంత్రాంగాన్ని ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన సక్రమంగా జరగలేదన్నారు. కొన్ని పార్లమెంట్ పరిధిలోని కొన్ని గ్రామాలు, మండలాలు పక్క జిల్లాలో ఉన్నాయని, ఇలాంటి సమస్యల్ని జిల్లాల పునర్విభజనలో సరి చేస్తామని చెప్పారు. అంతకుముందు వీఆర్వోల సంఘ నాయకులు మంత్రిని కలిసి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందించారు.