Minister Satya kumar: ఏపీలో పాలియేటివ్ కేర్ కోర్సు
ABN , Publish Date - Oct 17 , 2025 | 05:56 AM
దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి ఉపశమనం కలిగించేలా ప్రత్యేక చికిత్స అందించే పాలియేటివ్ కేర్ విభాగంలో పీజీ కోర్సుకు అనుమతించినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్...
హోమీ బాబా ఆస్పత్రిలో సీట్లకు అనుమతి: మంత్రి సత్యకుమార్
అమరావతి, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి ఉపశమనం కలిగించేలా ప్రత్యేక చికిత్స అందించే పాలియేటివ్ కేర్ విభాగంలో పీజీ కోర్సుకు అనుమతించినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం తెలిపారు. ఈ చికిత్సకు సంబంధించి పీజీ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టడానికి విశాఖపట్నంలోని హోమి బాబా క్యాన్సర్ ఆస్పత్రి ముందుకు రావడంతో చికిత్సా కేంద్రానికి ఆమోదం తెలిపామని చెప్పారు. దీతో రాష్ట్రంలో తొలిసారిగా పాలియేటివ్ కేర్ (ఉపశమన కోర్సు లేదా సహాయక సంరక్షణ కోర్సు) పీజీ కోర్సు ప్రారంభంకానుందని పేర్కొన్నారు. నాలుగు పీజీ సీట్లతో ప్రవేశాలు జరుగుతాయన్నారు. క్యాన్సర్, పక్షవాతం, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడే రోగులకు తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం కలిగించే చికిత్స విధానాన్ని పాలియేటివ్ కేర్ అంటారు. దీని ద్వారా తగిన మందులు, మనోధైర్యం కోల్పోకుండా సలహాలు, సూచనలు, ఫిజియోథెరపీ అందిస్తూ.. రోగిని సంరక్షిస్తారు.