Share News

Minister Satya Kumar: ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ పైపైకి

ABN , Publish Date - Oct 31 , 2025 | 04:41 AM

ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఓపీ, ఐపీ, వైద్య పరీక్షలతో పాటు వైద్యులు, సిబ్బంది హాజరు గణనీయంగా మెరుగుపడింది.

Minister Satya Kumar: ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ పైపైకి

  • 6 నెలల్లో 20శాతం పెరుగుదల నమోదు

  • నాలుగు కోట్ల మందికి పైగా వైద్య సేవలు

  • 80 నుంచి 150కి పెరిగిన ఓపీ కౌంటర్లు

  • రోగులు వేచి ఉండే సమయం తగ్గుదల

  • వైద్యులు, సిబ్బంది హాజరు 92 శాతానికి

  • వైద్య, రక్త పరీక్షల్లో 6.10 శాతం వృద్ధి

అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఓపీ, ఐపీ, వైద్య పరీక్షలతో పాటు వైద్యులు, సిబ్బంది హాజరు గణనీయంగా మెరుగుపడింది. గడిచిన ఆరు నెలల్లో 20 శాతం వృద్ధితో ప్రభుత్వ వైద్యశాలల్లో 4 కోట్ల మందికి పైగా ఓపీ సేవలు అందించారు. గతంలో ఓపీ సేవలు అందించడానికి ఒక్కో రోగికి సగటున 42 నిమిుషాలు పట్టేది. ప్రస్తుతం ఇది 26 నిమిషాలకు తగ్గిపోయింది. ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ కౌంటర్లు కూడా 80 నుంచి 150కి పెరిగాయి. ఎలకా్ట్రనిక్‌ హెల్త్‌ రికార్డులకు సంబంధించిన కౌంటర్లను 53 నుంచి 116కు పెంచారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైద్యరంగాన్ని మెరుగుపరచడానికి ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ చేపట్టిన ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. వివిధ విభాగాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరు, పథకాల అమలుకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఆయన ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ అనుకూల, ప్రతికూల అంశాల్ని నిశితంగా గమనించి, తగిన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఆరోగ్య రంగంలో పరిస్థితులను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వచ్చిన ఫలితాలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది హాజరు, ఓపీ, ఐపీ, డయాగ్నొస్టిక్‌ సేవల్లో పురోగతి, ఆరోగ్య పథకాల అమలులో వచ్చిన మార్పు ఆశాజనకంగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేశారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వంగా సంక్రమించిన సమస్యలను పరిష్కరించడంపై ఆరోగ్యశాఖ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది.


సిబ్బందిలో క్రమశిక్షణ రాహిత్యం, జవాబుదారీతనం లోపించడాన్ని గుర్తించిన మంత్రి సత్య... వివిధ విభాగాల పనితీరు, పథకాల అమలు మదింపు కోసం ఒక పటిష్ఠమైన, సమగ్ర మూల్యాంకన వ్యవస్థను గత నవంబరులో ప్రవేశపెట్టారు. దీని ఆధారంగా వివిధ జిల్లాల పనితీరు, పథకాల అమలు, డివిజన్లకు ర్యాంకులు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు ఈ ఏడాది ఏప్రిల్‌లో 83శాతం ఉండగా, సెప్టెంబరు నాటికి 92 శాతానికి పెరిగింది. నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది హాజరు 90 శాతానికి పైగా ఉండగా, వైద్యుల హాజరు 82శాతం ఉంది. తిరుపతిలో వంద శాతం, కాకినాడలో 99.92 శాతం, విశాఖ కేజీహెచ్‌లో 95.30 శాతం మంది వైద్యులు విధులకు హాజరువుతున్నారు. ఆరు నెలల సగటు ప్రకారం... విశాఖలో అత్యధికంగా 93.13 శాతం, కర్నూలు, రాజమండ్రిల్లో 90శాతానికి పైగా వైద్యుల హాజరు నమోదైంది. ఇక నెల్లూరు, ఏలూరు, గుంటూరు, తిరుపతిల్లో వైద్యుల హాజరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో దాన్ని మెరుగుపర్చడానికి చర్యలు చేపట్టాలని శాఖ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. ఇదే సమయానికి ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, ఈసీజీ సేవలతో పాటు ల్యాబ్‌ పరీక్షలను 2.50 కోట్ల మంది రోగులకు ఆరోగ్యశాఖ అందించింది. ఈ విషయంలో 6.10 శాతం వృద్ధి నమోదైంది.


పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం

వైద్య వ్యవస్థలో జవాబుదారీతనం కోసం నిరంతర పర్యవేక్షణతో చేసిన కృషి మంచి ఫలితాలను ఇవ్వడం అనందంగా ఉంది. ఓపీ సేవల్లో ఆరు నెలల్లో 20 శాతం వృద్ధి, ఐపీలో కూడా దాదాపు ఇంతే స్థాయిలో నమోదైంది. ఐపీని కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన కోసం చేయాల్సినది ఇంకా చాలా ఉంది.

- ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌

Updated Date - Oct 31 , 2025 | 04:43 AM