Share News

Minister Satya Kumar: పీపీపీకి ప్రైవేటీకరణకు తేడా తెలీదా

ABN , Publish Date - Sep 25 , 2025 | 06:32 AM

పీపీపీ విధానంలో రెండేళ్ల కాలంలోనే రాష్ట్రంలో మొత్తం మెడికల్‌ కాలేజీలను పూర్తి చేయడంతోపాటు రూ.3,700 కోట్ల ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Minister Satya Kumar: పీపీపీకి ప్రైవేటీకరణకు తేడా తెలీదా

  • నీలాంటి వ్యక్తి సీఎం కావడం దౌర్భాగ్యం

  • వైసీపీ పాలనలో ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా పూర్తి చేయకుండా వదిలేశారు

  • కళాశాలలను అడ్డుపెట్టి వేల కోట్లు అప్పు చేశారు.. అవేం చేశారో లెక్కలేదు

  • జగన్‌పై నిప్పులు చెరిగిన సత్యకుమార్‌

  • వైద్య కళాశాలలపై మండలిలో స్వల్ప చర్చ

  • వాకౌట్‌ చేసిన విపక్ష సభ్యులు

  • పారిపోతున్నారని అధికార పక్షం ఎద్దేవా

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘‘పీపీపీ విధానంలో రెండేళ్ల కాలంలోనే రాష్ట్రంలో మొత్తం మెడికల్‌ కాలేజీలను పూర్తి చేయడంతోపాటు రూ.3,700 కోట్ల ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైసీపీ నాయకులు దానిని ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. పబ్లిక్‌, ప్రైవేట్‌, పార్టనర్‌షి్‌పకి.. ప్రైవేటీకరణకు తేడా తెలియకుండా ఐదేళ్లపాటు ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేశాడంటే ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం’’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ శాసన మండలిలో మాజీ సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. రూ.లక్షల కోట్ల వ్యాపారం చేసుకునే వారికి ప్రైవేటీకరణకు, పీపీపీ మోడల్‌కు తేడా తెలియకపోవడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. మెడికల్‌ కాలేజీల పీపీపీ విధానంపై బుధవారం రాష్ట్ర శాసనమండలిలో స్వల్ప చర్చ జరిగింది. మంత్రి సత్యకుమార్‌ ప్రకటన చేస్తుండగా.. విపక్ష వైసీపీ సభ్యులు పదేపదే రన్నింగ్‌ కామెంట్రీ చేస్తూ మంత్రి ప్రసంగానికి అడ్డంకులు సృష్టించారు. ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘‘రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు.. 19 ప్రైవేట్‌ వైద్య కళాశాలలున్నాయి. ప్రతి జిల్లాలో ఒక వైద్య కళాశాల ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి.. 2020లో రాష్ట్రానికి 17 కాలేజీలను మంజూరు చేసింది. వీటిలో నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, విజయనగరం, రాజమండ్రి, పాడేరు కళాశాలలు పూర్తయ్యాయి. 10 కళాశాలలో 2025-26కి పూర్తి కావాల్సి ఉన్నా అవి పూర్తికాలేదు. మొత్తం 17 కాలేజీల నిర్మాణానికి రూ.8,480 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. గత ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.1,550 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే ఏడాదికి సగటున రూ.387 కోట్లు ఖర్చు పెట్టింది. ఒక్కొక్క కాలేజీకి సగటున రూ.22.79 కోట్లు వెచ్చించింది. ఈ పద్ధతిలో మొత్తం 17 వైద్య కళాశాలల నిర్మాణాన్ని పూర్తి చేయాలంటే 22 నుంచి 23 సంవత్సరాలు పడుతుంది. ఏడాదిక్రితం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రూ.736 కోట్లు ఖర్చు చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొదలు కావాల్సిన మార్కాపురం వైద్య కళాశాలకు మొత్తం ఆమోదిత వ్యయం రూ.475 కోట్లకు గాను నాలుగేళ్లలో రూ.46.26 కోట్లు (7శాతం) మాత్రమే గత ప్రభుత్వం చెల్లించింది. దీంతో ఈ కళాశాలలో మౌలిక వసతులు కల్పించలేదు. మిగిలిన కళాశాలల పరిస్థితి కూడా ఇలానే ఉంది.


వైసీపీ ఆఫీసులపైనే శ్రద్ధ

వైసీపీ హయాంలో కొత్తగా 5 మెడికల్‌ కాలేజీలను పూర్తిచేశామని ఆర్భాటంగా చెప్పుకొంటున్నారు. కానీ, చేసిందేమీ లేదు. మరోవైపు కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం కోసం వేల కోట్లు అప్పులు తెచ్చారు. ఆ నిధులు ఎక్కడికి పోయాయో తెలియడం లేదు. గత ప్రభుత్వంలో విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు సొమ్ములు కేటాయించారు. కానీ, నాలుగేళ్లలో రూ.1550 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కటంటే ఒక్క మెడికల్‌ కాలేజీని కూడా పూర్తి చేయలేకపోయారు. రూ.451 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసి రుషికొండ ప్యాలెస్‌ నిర్మించుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మెడికల్‌ కాలేజీ పూర్తి చేయలేదుగానీ, వైసీపీ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు.


రెండు గంటలు ధర్మమా: బొత్స

మెడికల్‌ కాలేజీల అంశంపై మంత్రి సుదీర్ఘంగా స్టేట్‌మెంట్‌ ఇవ్వడంపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘సభలో మంత్రి ప్రకటన చేయడానికి రెండు గంటల సమయం తీసుకోవడం ధర్మమా?. స్టేట్‌మెంట్‌ ఇచ్చేటప్పుడే జగన్‌పై విమర్శలు ఎందుకు?. ఈ అంశంపై చర్చ పూర్తయిన తర్వాత మంత్రి సమాధానాలిచ్చేటప్పుడు ఏమైనా మాట్లాడమనండి. మాకు అభ్యంతరం లేదు’’ అన్నారు. కాగా, నిబంధనల ప్రకారమే చైర్మన్‌.. మంత్రికి సమయం ఇచ్చారని, మెడికల్‌ కాలేజీల వెనుక రాజకీయ నిర్ణయాలున్నాయి కాబట్టే మంత్రి మాజీ సీఎం ప్రస్తావన తెచ్చారని మండలిలో ఉన్న మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. అనంతరం ఇదే అంశంపై చైర్మన్‌ మోషేన్‌రాజు చర్చకు అనుమతిచ్చారు. ఈసందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతూ.. మెడికల్‌ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకించారు. టీడీపీ సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, పంచుమర్తి అనురాధ తదితరులు పీపీపీని సమర్థించారు. విపక్ష నేత బొత్స మాట్లాడుతూ.. పీపీపీ విధానాన్ని నిరసిస్తూ తాము వాకౌట్‌ చేస్తున్నామని ప్రకటించి, వైసీపీ సభ్యులతో కలిసి బయటకెళ్లిపోయారు. అయితే, చర్చ నుంచి పా రిపోతున్నారని అధికారపక్ష సభ్యులు ఎద్దేవా చేశారు.


బాబు కట్టించారని.. కూల్చేశారు!

గతంలో సీఎం చంద్రబాబు నిర్మించారనే కారణంగా ప్రజావేదికను కూల్చేశారు. కానీ, మా ప్రభుత్వం అలాంటి పనులు చేయలేదు. పీపీపీ మోడల్‌లో చేపడుతున్న కొత్త మెడికల్‌ కాలేజీలను.. డిజైన్‌, ఫైనాన్స్‌, బిల్డ్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ విధానంలో నిర్మించాలని నిర్ణయించాం. యూపీ, ఒడిశా, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాలు కూడా పీపీపీ విధానాన్ని అనుసరించి సంపద సృష్టించుకుంటున్నాయి. కొత్త మెడికల్‌ కాలేజీలకు కేటాయించిన భూములను అమ్మేస్తున్నామంటూ వైసీపీ సభ్యులు అడ్డగోలు ప్రచారం చేస్తున్నారు. ఈ భూముల యాజమాన్య హక్కులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. కాలేజీల నిర్వహణ, పెట్టుబడులు పెట్టడం, ఆపరేషన్స్‌ మాత్రమే ప్రైవేటు సంస్థలు చేస్తాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. 33 ఏళ్ల లీజు పూర్తయిన తర్వాత ప్రభుత్వ స్వాధీనంలోకే వస్తాయి.


ప్రొఫెసర్లు భయపడుతున్నారు

పులివెందుల మెడికల్‌ కాలేజీలో బోధించడానికి వెళ్లడానికి ప్రొఫెసర్లు భయపడుతున్నారంటే అక్కడ నాయకుల వల్ల ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మెడికల్‌ సీట్లను అమ్మేస్తున్నారని, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని విష ప్రచారం మొదలుపెట్టారు. వాస్తవం ఏమిటంటే.. 50 శాతం కన్వీనర్‌ కోటా. 35 శాతం సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటా. 15 శాతం సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటా అంటూ 2021లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ స్కీం కింద జీవోలు తెచ్చి మెడికల్‌ సీట్లు అమ్మింది వైసీపీ ప్రభుత్వమే. ఇప్పుడు అదే విధానం కొనసాగుతుంది తప్ప కూటమి ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని మంత్రి ప్రకటన చేశారు. కాగా, విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన వారికి ఏపీ వైద్య మండలి ద్వారా శాశ్వత రిజిస్ర్టేషన్‌ కల్పించే విషయాన్ని ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు.


అదొక్కటే పూర్తి చేయాలనుకున్నారా?

వైసీపీ హయాంలో వైద్య కళాశాలలకు రూ.500 కోట్లకు అనుమతి మంజూరు చేశారు. ఈ నిధుల్లో ఒక్క పులివెందుల కాలేజీకే రూ.396.16 కోట్లు చెల్లించారు. గిరిజన ప్రాంతంలోని పార్వతీపురం వైద్య కళాశాలకు రూ.600 కోట్లతో పరిపాలనా అనుమతి ఇచ్చారు. కానీ, ఇంతవరకు భూసేకరణ కూడా చేయలేదు. టెండర్లు కూడా పిలవలేదు. పార్వతీపురంలో ఉన్న 100 పడకల మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ను చూపించి అక్కడ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ఆసుపత్రి నిర్మించామని చెబుతున్నారంటే ఏమనుకోవాలి?. రాష్ట్రంలో మిగిలిన మెడికల్‌ కాలేజీలన్నింటినీ గాలికొదిలి ఒక్క పులివెందుల కాలేజీని మాత్రమే పూర్తి చేయాలనుకున్నారా?. ఆయన(జగన్‌) కేవలం పులివెందులకే ముఖ్యమంత్రి అనుకున్నారా?. లేక రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారా?. అనేది ఆయనే ఆత్మపరిశీలన చేసుకోవాలి. తాడేపల్లి, ఇడుపులపాయ, బెంగుళూరులో భూములు సేకరించకుండానే ప్యాలెస్‌లు నిర్మించారా?

Updated Date - Sep 25 , 2025 | 06:34 AM