Minister Sandhyarani: డోలీ మోతలు తప్పించడమే లక్ష్యం
ABN , Publish Date - Apr 12 , 2025 | 06:46 AM
గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణంపై కూటమి ప్రభుత్వ దృష్టి సారించిందని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఐదు కిలోమీటర్ల బీటీ రహదారిని ప్రారంభించారు

పార్వతీపురం, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): గిరిజనులకు డోలీ మోతలు తప్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలో జి.శివడ నుంచి రాముడుగూడ వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర నిర్మించిన బీటీ రహదారిని శుక్రవారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కనిపించలేదు. కూటమి ప్రభుత్వం ప్రతి గిరిజన గ్రామానికీ రహదారి నిర్మించడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతోంది. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. జిల్లాలో ఏనుగుల సమస్యను పరిష్కరిస్తాం. గురుకులాలు, కళాశాలలు, పాఠశాలల, అభివృద్ధికి రూ.159 కోట్లు మంజూరయ్యాయి’ అని తెలిపారు.