Minister Sandhya rani: విద్యార్థులకు తీవ్ర అనారోగ్య సమస్యల్లేవు
ABN , Publish Date - Oct 18 , 2025 | 06:47 AM
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు తీవ్ర అనారోగ్య సమస్యలు లేవని గిరిజన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.
కావాలనే కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు: మంత్రి సంధ్యారాణి
పార్వతీపురం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు తీవ్ర అనారోగ్య సమస్యలు లేవని గిరిజన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మలేరియా, జాండీస్, వైరల్ ఫీవర్లతో సాలూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను శుక్రవారం సాయంత్రం ఆమె పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని, ఏ ఒక్కరికీ తీవ్ర అనారోగ్యం లేదని తెలిపారు. పీహెచ్‌సీ వైద్యుల సమ్మె వల్ల సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాల నుంచి పలువురు విద్యార్థులు వచ్చి సాలూరు పట్టణ ఏరియా ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. వారిలో ఇద్దరు పచ్చకామెర్లతో బాధపడుతుండగా.. ఇప్పటికే ఒకరిని డిశ్చార్జి చేసినట్లు చెప్పారు. మిగిలిన విద్యార్థులందరూ బాగానే ఉన్నారని, కొంతమంది కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.