Minister Sandhya Rani: జగన్... తస్మాత్ జాగ్రత్త
ABN , Publish Date - Oct 07 , 2025 | 04:36 AM
గిరిజనులు అంటే అంత చులకనా తస్మాత్ జాగ్రత్త జగన్.. అసభ్యకరంగా మాట్లాడితే సహించేది లేదు అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హెచ్చరించారు.
గిరిజనులంటే అంత చులకనా..?: మంత్రి సంధ్యారాణి
మంత్రి అచ్చెన్నతో కలసి ఆసుపత్రిలో విద్యార్థినులకు పరామర్శ
పార్వతీపురం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ‘గిరిజనులు అంటే అంత చులకనా? తస్మాత్ జాగ్రత్త జగన్.. అసభ్యకరంగా మాట్లాడితే సహించేది లేదు’ అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హెచ్చరించారు. పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పచ్చకామెర్లతో చికిత్స పొందుతున్న కురుపాం గురుకుల విద్యార్థినులను సోమవారం మంత్రులు అచ్చెన్నాయుడు, సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యే విజయచంద్ర, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడారు. సీఎం చంద్రబాబుతో పాటు తనను ఉద్దేశించి ‘గాడిదలు కాస్తున్నారా?’ అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళలంటే గౌరవం లేదా? అని ప్రశ్నించారు. ‘విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాం. ఏ ఒక్కరూ అనారోగ్యంతో ఇబ్బంది పడకుండా అవసరమైన చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్‌లో వైద్యం పొందుతున్న విద్యార్థినుల్లో ఒకరు సికిల్ సెల్ అనీమియాతో బాధపడుతున్నారు. విశాఖ కేజీహెచ్, పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు కోలుకున్న తర్వాతే డిశ్చార్జి చేస్తాం. ఇద్దరు విద్యార్థినులు మృతి చెందితే 11 మంది చనిపోయారంటూ ప్రచారం చేయడం తగదు’ అని మంత్రి సంధ్యారాణి అన్నారు. అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. నిన్నటి వరకు అధికారంలో ఉండి, బాధ్యత గల పదవులు నిర్వహించిన వ్యక్తులు నేడు విద్యార్థినుల అనారోగ్య ఘటనను రాజకీయం చేయాలని చూడటం శోచనీయమని ఈ విషయాన్ని తాము రాజకీయం చేయదలచుకోలేదని తెలిపారు.