Minister Sandhya Rani: క్షమాపణ చెప్పకుంటే ఎన్‌టీవీపై క్రిమినల్ కేసు పెడతా
ABN , Publish Date - Aug 26 , 2025 | 05:06 AM
తనపై ఎన్‌టీవీ దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
24 గంటల్లో స్పందించకుంటే ఎస్టీ కమిషన్‌కూ ఫిర్యాదు చేస్తా: మంత్రి సంధ్యారాణి
విశాఖపట్నం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): తనపై ఎన్‌టీవీ దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలతో ఆ చానల్ కథనాలు ప్రసారం చేస్తోందని, వాటికి ఆధారాలు చూపించాలని, లేదా 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. లేదంటే క్రిమినల్ కేసులు పెడతానని, గిరిజన మహిళగా తన హక్కులకు భంగం కలిగించేలా ఫేక్ ప్రచారం చేసిన ఎన్‌టీవీపై జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని సంధ్యారాణి స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమ శాఖకు చెందిన ఒక అధికారి ఏసీబీకి పట్టుబడిన వ్యవహారంలో తనపై ఎన్‌టీవీలో తప్పుడు కథనాలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సోమవారం ఆమె మాట్లాడారు. గిరిజన మహిళగా తన ఎదుగుదల చూసి ఓర్వలేక ఎన్‌టీవీ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా గడచిన ఏడాదిలో రూ.1,300 కోట్లతో రోడ్లు అభివృద్ధి చేశామని, మారుమూల గిరిజన గ్రామాలకు డోలీ మోతలు ఉండకూడదని పెద్దఎత్తున నిధులు వెచ్చించామని మంత్రి చెప్పారు. శాఖాపరంగా అంత అభివృద్ధి జరుగుతుంటే సైకో జగన్‌కు వత్తాసు పలికుతున్న ఆ ఛానల్ తనపై తప్పుడు ఆరోపణలతో కథనాలు ప్రసారం చేస్తోందన్నారు. తన కుమార్తె జన్మదిన వేడుకలు విజయవాడలో నిర్వహిస్తే, తిరుపతిలో చిందులు వేశామని జగన్ పత్రిక సాక్షిలో తప్పుడు కథనాలు ప్రసారం చేశారని, దీనిపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెడితే ఇప్పుడు కాళ్లబేరానికి వచ్చారని ఆమె అన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో ఒక అధికారి ఏసీబీకి పట్టుబడితే మంత్రికి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఏసీబీకి దొరికిన అధికారిపై విచారణ జరుగుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆయన స్థానంలో ఒక మహిళా అధికారికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించామన్నారు.