Minister Payyavula Keshav: టెక్నాలజీతో పన్ను ఆదాయం పెంచండి
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:09 AM
జీఎస్టీ చట్టంలోని లోపాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వానికి భారీ స్థాయిలో పన్నులు ఎగ్గొట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు.
ఎగ్గొట్టేవారిపై కఠిన చర్యలు
పన్నుల వసూళ్లలో ఏపీ వెనుకబాటు
అక్రమంగా సరుకు అంతర్రాష్ట్ర రవాణా
కళ్లు మూసుకుని నిద్రపోతుంటే ఎలా?
క్షేత్రస్థాయి నుంచి చిత్తశుద్ధితో పనిచేయాలి
వాణిజ్య పన్నుల శాఖ అధికారుల వర్క్‌షాపులో మంత్రి పయ్యావుల
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): జీఎస్టీ చట్టంలోని లోపాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వానికి భారీ స్థాయిలో పన్నులు ఎగ్గొట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో ఆ శాఖ జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల రెవెన్యూ వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. ‘నేరస్వభావం ఉన్న వ్యాపారులు కళ్ల ముందే మోసాలకు పాల్పడుతూ ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్నామంటూ సవాల్ విసురుతుంటే.. ఏమీ చేయకుండా ఉండటం మనకు అవమానకర విషయం కాదా? చేతులు కట్టుకుని చూస్తూ మన అసమర్థతను చాటుకుందామా? అని మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొడుతూ దర్జాగా అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తున్న క్రిమినల్స్‌ను నియంత్రించలేకపోతున్నామని, మనలో ఆ ఉద్దేశం లేకపోవడమే కారణమని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ అధికారుల అనుభవం, అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రభుత్వానికి తరచూ పన్నులు ఎగ్గొడుతున్న వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పనితీరులో దేశానికే ఆదర్శమని, ఎవరికీ తీసిపోరనే మంచి పేరు ఉందని, దానిని నిలబెట్టుకోవాలని సూచించారు. ‘వాణిజ్య పన్నుల శాఖలో వాస్తవిక సమస్యలు ఏంటనేది ఏడాది కాలంగా తెలియడం లేదు. పన్నుల ఆదాయం పెరగకపోవడానికి కారణాలేమిటనేది ఈ శాఖ అధికారులే చెప్పాలి. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకున్నా పన్నుల వసూళ్లలో ఏపీ వెనకబడుతోంది. పన్నులు చెల్లించకుండా, తప్పుడు ఈ-వే బిల్లులు, స్ప్లిట్ బిల్లులతో ఇతర రాష్ట్రాల నుంచి సరుకును అక్రమ రవాణా చేసే వాహనాలను రాష్ట్ర సరిహద్దుల్లోని టోల్‌గేట్ల వద్దనే గుర్తించి అడ్డుకోవాలి. రాష్ట్రంలోకి వచ్చే ప్రతి ఎల్‌ఆర్ కూడా నమోదు కావాల్సిందే.
మనం కళ్లు మూసుకుని నిద్రపోతుంటే ఎలా? ముఖ్యమంత్రే ఉదయం లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు రాష్ట్రం కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని మంత్రులుగా మేమూ పని చేస్తున్నాం. మరి ప్రభుత్వ అధికారులుగా మీరెందుకు పనిచేయరు? నా మాటలు కాస్త కటువుగానే అనిపించవచ్చు. జీతాల చెల్లింపులతో పాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రభుత్వాన్ని నడపటం అంత సులువు కాదు. ముఖ్యమంత్రి చేస్తున్న కృషి మిగిలిన శాఖలలో కనిపిస్తోంది. వాణిజ్య పన్నుల శాఖలో మాత్రం కనిపించడం లేదు. క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు అందరూ డెడ్‌లైన్లు పెట్టుకుని చిత్తుశుద్ధితో పనిచేయాలి. పెండింగ్‌లో ఉన్న పన్ను బకాయిల వసూలుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలి. మనం కళ్లు మూసుకుని నిద్రపోతుంటే మన ఏజెన్సీలు చచ్చిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు నష్టపోతున్నారు. డేటా ఆధారంగా పన్నులు ఎగ్గొట్టేవారికి మనమేంటో చూపించాలి. అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని పయ్యావుల అన్నారు.