Share News

Minister Payyavula Keshav: వాజపేయి అడుగుజాడల్లో మోదీ, బాబు

ABN , Publish Date - Dec 13 , 2025 | 06:38 AM

మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజపేయి దేశంలో అనేక సంస్కరణలను తీసుకువచ్చారని మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు.

Minister Payyavula Keshav: వాజపేయి అడుగుజాడల్లో మోదీ, బాబు

  • మంత్రి పయ్యావుల కేశవ్‌ వెల్లడి

  • అనంతలో మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ

అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజపేయి దేశంలో అనేక సంస్కరణలను తీసుకువచ్చారని మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. వాజపేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాఽధవ్‌ చేపట్టిన సుపరిపాలన యాత్ర శుక్రవారం అనంతపురం చేరుకుంది. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన వాజపేయి విగ్రహాన్ని మంత్రి సత్యకుమార్‌, పీవీఎన్‌ మాధవ్‌తో కలసి కేశవ్‌ ఆవిష్కరించారు. అనంతరం సభలో ప్రసంగించారు. ‘అటల్‌ అడుగు జాడల్లోనే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నడుస్తున్నారు. దేశం, రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. వాజపేయి చూపిన మార్గంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ బాటలో నడుస్తుంటే.. కూటమిలో చీలికలు తప్పవని వైసీపీ కుట్రలు చేస్తోంది. వాటిని తిప్పి కొడుతూ రోజు రోజుకీ కూటమి బలపడుతోందనేందుకు సాక్ష్యం అనంతపురంలో జరిగిన ఈ విగ్రహావిష్కరణ మహోత్సవమే. సుపరిపాలన యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం కావాలి’ అని పయ్యావుల ఆకాంక్షించారు. మాధవ్‌ మాట్లాడుతూ, ‘బీజేపీ, టీడీపీ బంధం ఎన్టీఆర్‌తో మొదలైంది. చంద్రబాబు కొనసాగిస్తున్నారు. వాజపేయి విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి సీఎం పూర్తి సహాయ, సహకారాలు అందించారు. ఆయనకు ధన్యవాదాలు’ అని అన్నారు. ‘చిన్న కుటుంబంలో జన్మించి, ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన అటల్‌ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని మంత్రి సత్యకుమార్‌ అన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 06:39 AM