Minister Payyavula Keshav: సీమ ప్రాజెక్టుల్లో వైసీపీ తట్టెడు మట్టి తీయలేదు
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:35 AM
వైసీపీ ఐదేళ్ల పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులలో తట్టెడు మట్టిని కూడా తీయలేదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు.
మేం వాటిని పరుగులు పెట్టిస్తున్నాం: మంత్రి పయ్యావుల
ఉరవకొండ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులలో తట్టెడు మట్టిని కూడా తీయలేదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో ఆయన లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్‌లను సోమవారం పంపిణీ చేశారు. అనంతరం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్‌ఎంఎ్‌సఏ కింద రూ.43.75 లక్షలతో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నాం. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో అమరావతి, పోలవరం ప్రాజెక్టు సహా అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మీద సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. వైసీపీ పాలనలో గాలేరు-నగరీ, హంద్రీనీవా ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు. దెబ్బతిన్న శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించలేదు. కానీ మేం రాయలసీమ ప్రాజెక్టులను మళ్లీ పరుగులు పెట్టించేదిశగా ముందుకుపోతున్నాం’ అని పయ్యావుల అన్నారు.