Minister Parthasarathy: రాక్రీట్ దోపిడీ 80 కోట్లు
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:59 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆప్షన్-3 కింద ప్రభుత్వమే ఇళ్లు నిర్మించే స్కీమ్‌లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణలో తేలిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు.
ఆప్షన్-3 ఇళ్ల నిర్మాణ పథకంలో అవినీతి
ఇళ్లు పూర్తి చేయకుండా లబ్ధిదారులకు మోసం
కేసు నమోదు చేసి సొమ్ము రికవరీకి చర్యలు
ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేలా కామన్ వాల్‌తో ట్విన్ హౌసెస్.. త్వరలో జీవో
వచ్చే నాలుగేళ్లలో 12.59 లక్షల ఇళ్లు పూర్తి
వచ్చే ఉగాదికి 5 లక్షల గృహాలు: పార్థసారథి
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆప్షన్-3 కింద ప్రభుత్వమే ఇళ్లు నిర్మించే స్కీమ్‌లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణలో తేలిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంబంధీకులకు చెందిన రాక్రీట్ సంస్థ రూ.80 కోట్లు అవినీతికి పాల్పడినట్లు వెల్లడైందని చెప్పారు. ఈ సొమ్మును ఆ సంస్థ నుంచి రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆ సంస్థపై క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేయనున్నట్లు చెప్పారు. ఈ సంస్థకు 50,402 ఇళ్ల నిర్మాణ పనులు అప్పగించారని, వీటిలో 47,850 ఇళ్ల నిర్మాణ పనులు తీసుకుని, ఎక్కడా పూర్తి చేయకుండా లబ్ధిదారులకు అన్యాయం చేసిందని తెలిపారు. ఏయే జిల్లాల్లో అవకతవకలకు పాల్పడిందో, అక్కడ లీగల్‌గా అవకాశం ఉన్న అన్ని రకాల కేసులను నమోదు చేయాలని ఆదేశించామని మంత్రి తెలిపారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కామన్ వాల్‌తో ట్విన్ హౌసెస్ నిర్మించుకునే అవకాశాన్ని కల్పిస్తూ త్వరలో జీవో జారీ చేయనున్నట్లు వెల్లడించారు. పేదలకు ఇచ్చిన ఇళ్లకు పై అంతస్తు నిర్మాణం చేసుకోవడానికి చాలా మంది అడుగుతున్నారని, ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమ న్నారు.
ఐదేళ్లలో 15.59 లక్షల గృహాల లక్ష్యం కాగా, ఇప్పటికే 3 లక్షల గృహాలను పూర్తి చేశామని, మిగిలిన 12.59 లక్షల గృహాలను వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. వచ్చే ఉగాది నాటికి 5 లక్షలు, జూన్ నాటికి మరో 87వేల గృహాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. పీఎంఏవై 1.00 పథకం అమలు గడువు డిసెంబరుతో ముగియనుందని, కేంద్రం మరో ఏడాది పాటు దీన్ని పొడిగించనుందని చెప్పారు. ఈ పథకం కింద ఇప్పటి వరకూ ప్రారం భం కాని 3.03 లక్షల గృహాల లబ్ధిదారులు వాటిని మొదలు పెడితే పూర్తి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ‘‘వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 6 లక్షల గృహాలు మాత్రమే పూర్తి చేసింది. మా ప్రభుత్వం వచ్చిన 16 నెలల్లోనే 3.19 లక్షల గృహాలను పూర్తి చేసింది. 2014-19 మధ్య ఎన్‌టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద మంజూరు చేసి వివిధ దశల్లో ఉన్న 4.7 లక్షల గృహాలను గత ప్రభుత్వం రద్దు చేసింది. పూర్తయిన 2.7 లక్షల గృహాలకు రూ.920 కోట్లు చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు అన్యాయం చేసింది. మా ప్రభుత్వం పక్షపాతం చూపకుండా గత ప్రభుత్వం మంజూరు చేసిన 18.61 లక్షల గృహాల్లో మిగిలి ఉన్న 11.90 లక్షల గృహ నిర్మాణాలను కొనసాగిస్తున్నాం. సర్వేలో ఇప్పటి వరకు 81 వేల మందికి ఇళ్ల స్థలాలు అవసరమని గుర్తించాం. ప్రభుత్వ, పోరంబోకు స్థలాల్లో ఉం టున్న దాదాపు 1.15 లక్షల మందికి పొజిషన్ సర్టిఫికెట్లను అందజేయాలని సీఎం ఆదేశించారు’’ అని మంత్రి తెలిపారు.