Minister parthasarathy: నాలా చట్టం రద్దుకు ఆర్డినెన్స్
ABN , Publish Date - Aug 22 , 2025 | 04:53 AM
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయభూమి (సాగేతర అవసరాలకు మళ్లింపు- నాలా) చట్టం 2006 ను ఉపసంహరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దాని స్థానంలో డెవల్‌పమెంట్ చార్జీలు వసూలు
పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూములు
కుప్పం, దగదర్తిల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు
మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా కమిషన్‌గా భాషా సంఘం పేరు మార్పు
రాజధాని గ్రామాల్లో 904 కోట్లతో వసతులు
టెన్నిస్ సాకేత్‌కు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం
క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ వ్యవసాయభూమి (సాగేతర అవసరాలకు మళ్లింపు- నాలా) చట్టం 2006 ను ఉపసంహరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నాలా చట్టం రద్దవుతున్న నేపథ్యంలో దాని స్థానంలో రిజిస్ర్టేషన్ శాఖ ఆధ్వర్యంలో భూమి అభివృద్ధి చార్జీలను (ల్యాండ్ డెవల్‌పమెంట్ ఫీజులు) వసూలుచేయాలన్న ప్రతిపాదననూ ఆమోదించారు. సాగేతర అవసరాలకు మళ్లించే భూమి విలువలో నాలుగు శాతాన్ని డెవల్‌పమెంట్ ఫీజుగా వసూలుచేయాలన్న సూచనకూ ఆమోదం లభించింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే, వేస్ట్ రీస్లైకింగ్ పాలసీ, క్యాంటమ్ కంప్యూటింగ్ హబ్, సచివాలయాల్లో డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్‌ప్రాతిపదికన 2778 పోస్టుల భర్తీ, రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల కల్పన, పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు.. ఇలా మొత్తం 33 ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ వివరాలను సచివాలయంలో సమాచారశాఖ మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు.
ముఖ్యాంశాలు..
పెరుగుతున్న పారిశ్రామిక వ్యర్థాల సవాళ్లు, పునఃవినియోగంలోని ఆర్థిక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని 2025-30 కాలానికి తయారుచేసిన ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థ పదార్థాల పునర్వినియోగ విధానం (4.0)కు ఆమోదముద్ర.
ఏపీ టూరిజం భూమి కేటాయింపు విధానానికి అనుబంధ అంశాల చేర్పునకు సంబంధించిన ప్రతిపాదనకు సమ్మతి. ఇందులో భూమి కేటాయింపుకు అర్హత, లాండ్ బ్యాంక్ నోటిఫికేషన్, పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రకటించిన భూములను కేటాయించే విధానం, ప్రకటించిన పరిమితుల ఆధారంగా ప్రతిపాదనలు, డీపీఆర్‌ల మూల్యాంకనం, ప్రాజెక్టు అమలు కాలపరిమితులు వంటి ముఖ్య అంశాలు చేర్చారు.
అధికార భాషా సంఘం పేరు ’మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా కమిషన్’’గా మార్పు
గుంటూరులో 2,954 గజాల మున్సిపల్ భూమిని 33 ఏళ్ల కాలానికి 2017 జూలై 30 నుంచి ఎకరానికి రూ.వెయ్యి అద్దె చెల్లించేలా టీడీపీ కార్యాలయానికి కేటాయిస్తూ ఇచ్చిన జీవో.340కు ఆమోదం.
అమరావతిలోని 29 గ్రామాలకు రూ.904 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు పరిపాలనామోదం. సీఆర్‌డీఏ ప్రాంతంలోని వివిధ సంస్థలకు చేసిన భూమి కేటాయింపులపై సమీక్షకు సంబంధించిన మంత్రివర్గఉపసంఘం సిఫారసులకు ఓకే.
సచివాలయాల చట్టం2023లోని వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ అనే దానిలో.. విద్య అనే పేరు తొలగింపు. సచివాలయాల్లో డిప్యుటేషన్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 2,778 పోస్టుల భరీ.
ఐఎంఎఫ్ఎల్, బీర్, వైన్, ఆర్‌టీడీ , విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ ద్వారా ప్రాథమిక ధరల నిర్ణయానికి చేసిన ప్రతిపాదనకు సమ్మతి.
మాన్యువల్ స్కావెంజర్స్, డ్రైలెట్రిన్‌లను శుభ్రం చేసేవారి ఉపాధి (నిషేధ)చట్టం- 1993 రద్దు తీర్మానాన్ని శాసనసభ ముందుంచే ప్రతిపాదనకు ఆమోదం. ఏపీ బెగ్గింగ్ నిషేధ చట్టం 1977ను సవరించాలని, దివ్యాంగులు, కుష్ఠువ్యాధి బాధితులు, ఇతర వైకల్యం కలిగిన వారి పట్ల వివక్షను సూచించే పదాలను తొలగిస్తూ తయారుచేసిన ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తల్లూరు గ్రామంలో తోట వెంకటాచలం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లో పీఎ్‌ససీ ప్రెషర్ మెయిన్‌ను ఎంఎస్ ప్రెషర్ మెయిన్‌తో మార్చే పనికి టెండర్లు పిలవాలని నిర్ణయం. 5167.80 కోట్లకు పాలనామోదం.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరులో 50 పడకల కమ్యూనిటీ హె ల్త్ సెంటర్‌ను రూ.3394 కోట్లతో 100పడకల ఏరియా ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయం. చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో 30పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్.. 50 పడకల సీహెచ్‌సీగా అప్‌గ్రేడేషన్
టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనిని స్పోర్ట్స్ కోటా కింది డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ నిర్ణయం.
వైసీపీ హయాంలో హత్యకు గురైన పల్నాడు జిల్లా కు చెందిన చంద్రయ్య కుమారుడు వీరాంజినేయులకు జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని వడ్డిరాల, దొడియం గ్రామాల్లో 1200ఎకరాల ప్రభుత్వభూమిని 33ఏళ్ల లీజుకు అదానీ సోలార్ ఎనర్జీ ఏపీ ఎయిట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయింపు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ప్రోత్సహించే ప్రభుత్వ విధానానికి అనుగుణంగా 2006 చట్టం కింద మార్పిడికి అనుమతి పొందే ప్రక్రియను మరింత సులభతరం చేయాలని నిర్ణయం.
డి.కేశవరావు అలియాస్ దున్నకేశవరావు అనే వ్యక్తిపై నమోదైన 16 కేసుల విచారణకు శ్రీకాకుళంలో స్పెషల్ కోర్టు ఏర్పాటుకు ఆమోదం.
సముద్ర, అనుబంధ కార్యకలాపాలకు పెరుగుతున్న డిమాండ్లను తీర్చేవిధంగా ఏపీ సముద్ర విధానం సవరణకు ఆమోదం.
చిత్తూరుజిల్లా కుప్పం, నెల్లూరు జిల్లా దగదర్తిలో గ్రీన్ ఫీల్డ్ విమానాశాశ్రయాల అభివృద్ధికి మౌలిక వసతులు, పెట్టుబడులశాఖ చేసిన ప్రతిపాదనకు సమ్మతి.
చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం బైరుగానిపల్లె గ్రామంలోని ప్రభుత్వ భూమి కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు ఉచితంగా కేటాయింపు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండం, నడింపాలెం గ్రామంలోని 12.96 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమిలో కేంద్రం నిధులతో సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతి సంస్థ ఏర్పాటుకు ఆమోదం.
62ఏళ్లు నిండిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు వరుసగా రూ.లక్ష, రూ.40వేలు గ్రాట్యుటీగా చెల్లించాలంటూ మహిళా,శిశు సంక్షేమశాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం