Minister Narayana: అమృత్ అక్రమాలపై.. సభాసంఘానికి మంత్రి నో
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:44 AM
గత ప్రభుత్వ హయాంలో అమృత్ 2.0 పథకం కింద చెరువుల సుందరీకరణ పనులు చేయకుండానే బిల్లులు చెల్లించారని.. దీనిపై సభాసంఘాన్ని నియమించాలని ఆమదాలవలస ఎమ్మెల్యే...
5 రెట్లు ఎక్కువ చెల్లింపులు జరిగాయంటూనే నిరాకరణ
తమ నియోజకవర్గాల్లో పనులే మొదలుకాలేదని ఎమ్మెల్యేల గగ్గోలు
హౌస్ కమిటీకి పట్టుబట్టిన కూన రవికుమార్
సీరియస్ సమస్య అని డిప్యూటీ స్పీకర్ చెప్పినా పట్టించుకోని మంత్రి నారాయణ
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో అమృత్ 2.0 పథకం కింద చెరువుల సుందరీకరణ పనులు చేయకుండానే బిల్లులు చెల్లించారని.. దీనిపై సభాసంఘాన్ని నియమించాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సహా పలువురు ఎమ్మెల్యేలు కోరినా పురపాలక మంత్రి పి.నారాయణ ససేమిరా అన్నారు. తమ ప్రాంతంలో రూపాయి పని కూడా జరగలేదని కూన చెప్పగా.. మూడు పనులు జరిగినట్లుగా తమ రికార్డుల్లో ఉందని మంత్రి జవాబిచ్చారు. దీంతో మంత్రి, అధికారులు ఆమదాలవలస వచ్చి.. అక్కడ కనీసం రూపాయి పనైనా జరిగిందో లేదో చూసి చెప్పాలని కూన ఆహ్వానించారు. ఆమదాలవలసలో ఆర్టీసీ బస్టాండ్ పక్కన 46.2 ఎకరాల విస్తీర్ణంలో ఒక చెరువు ఉందని, సుందరీకరణ కోసం గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా రూ.85 లక్షల విలువైన పనులు మంజూరు చేశారని.. ఇందులో పనులేమీ జరగకుండానే రూ.42 లక్షలు చెల్లించారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా పనులు చేయకుండా రూ.101 కోట్లు చెల్లించగా.. ఇందులో 25శాతం పనులు కూడా జరగలేదని.. ఆమదాలవలస ప్రాజెక్టుకు సంబంధించి ఖర్చు కంటే 55 శాతం ఎక్కువ చెల్లింపులు జరిగాయని మంత్రి అంగీకరించారు. అయితే సభాసంఘం వేయడానికి మాత్రం సమ్మతించలేదు. ఈ నిధులు తాడేపల్లి, రుషికొండ ప్యాలె స్‌ల కోసం, విజయవాడ ఎయిర్‌పోర్టు, విజయవాడ స్వరాజ్‌మైదాన్, జీ-20 సదస్సుకు ఖర్చు చేశామంటూ ఆర్వీ కన్‌స్ట్రక్షన్‌కు చెల్లింపులు చేశారని.. దీనిపై విచారణ చేయాలని కూన కోరారు. సెంట్రల్ ప్లాంటేషన్ పథకంలో అంచనా ఖర్చు, ఒప్పందంలో వేసిన వ్యయం ఒకేలా ఉన్నాయని.. వాస్తవానికి ఇవి రెండూ వేర్వేరుగా ఉండాలని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే ఆ కార్పొరేషన్‌లో చీఫ్ ఇంజనీర్ నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరూ ప్రజాధనం దుర్వినియోగం చేశారని అర్థమవుతోందన్నారు.
పథకం కింద రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం సీరియస్ అంశమని డిప్యూటీ స్పీకర్ అభిప్రాయపడ్డారు. జీ-20 సదస్సు నిర్వహణ సమయంలో కూడా ఈ పథకం కింద నిధులు దుర్వినియోగం చేశారని.. విచారణ చేపట్టాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మంత్రిని కోరారు. తమ ప్రాంతంలో ఉన్న వెంకటరాయన కోనేరు సుందరీకరణ కోసం రూ.23 లక్షలు మంజూరు చేశారని, తీరా చూస్తే అక్కడ ఏ ఒక్క పనీ జరగలేదని.. దీనిపై హౌస్ కమిటీ వేయాలని పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ కూడా విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతంలో ఉన్న చెరువు సుందరీకరణకు నిధులు మంజూరు చేసినప్పటికీ.. అక్కడ ఏ పనీ చేయలేదని కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కోరారు. చాలా మంది ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలోనూ ఇవే సమస్యలున్నాయన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సమస్య ఉందని, దీనిపై మంత్రి మాట్లాడతారని డిప్యూటీ స్పీకర్ చెప్పారు. నారాయణ స్పందిస్తూ.. ఆమదాలవలసలో పనులు జరిగాయనే మళ్లీ చెప్పారు. వాటికి ఐదు రెట్లు డబ్బు ఎక్కువ చెల్లించారనీ తెలిపారు. తాడేపల్లి, పాడాలో జరిగిన పనులపై విజిలెన్స్ నివేదిక రావలసి ఉందన్నారు. దీనిపై కూన మాట్లాడుతూ.. ‘ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది. ఇంకా నివేదిక రాలేదంటే కాలయాపనే కదా! హౌస్ కమిటీ వేయడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేమిటి ’ అని ప్రశ్నించారు. డిప్యూటీ స్పీకర్ అనుమతితో హౌస్ కమిటీ కోరుతూ కూన తీర్మానం ప్రవేశపెట్టారు. అయినప్పటికీ మంత్రి స్పందించలేదు. దీంతో మంత్రి నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఈ సమస్యపై మరింత సమయం తీసుకుని మళ్లీ చర్చిద్దామని డిప్యూటీ స్పీకర్ చెప్పారు.
సచివాలయాలు, ఆక్వా సవరణ బిల్లులకు ఆమోదం
అసెంబ్లీ బుధవారం రెండు బిల్లులను ఆమోదించింది. ఏపీ గ్రామ/వార్డు సచివాలయాల చట్టం (2023)లో.. గ్రామ సచివాలయంలో విద్య అంశాలను వార్డు విద్య, డేటా విశ్లేషణ కార్యదర్శి నుంచి తొలగించి వార్డు సంక్షేమ, అభివృద్ధి కార్యదర్శికి అప్పగించేలా చేసిన సవరణను సభ్యులు ఆమోదించారు. ఎమ్మెల్యేలు గణబాబు, ఆదిరెడ్డి శ్రీనివాస్ దీనిపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపల పెంపకపు అభివృద్ధి ప్రాధికార సంస్థ చట్టం (2020)లో కూడా సవరణ చేశారు. దాదాపు 20 శాతం మంది ఆక్వా రైతులు తమ పాత రిజిస్ర్టేషన్లను నిర్ణీత సమయంలోపు ఎండార్స్ చేసుకోలేదని, దీనిని పరిష్కరించడం కోసం ఈ సవరణ చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.