Share News

Minister Nimmala Ramanaidu: గోదావరి డెల్టాకు పూర్వవైభవం తెస్తాం

ABN , Publish Date - Dec 10 , 2025 | 05:52 AM

గోదావరి డెల్టా ముంపు సమస్యతో పాటు సాగునీటి సమస్యలను పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.

Minister Nimmala Ramanaidu: గోదావరి డెల్టాకు పూర్వవైభవం తెస్తాం

  • ముంపు, సాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం

  • ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష

అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): గోదావరి డెల్టా ముంపు సమస్యతో పాటు సాగునీటి సమస్యలను పరిష్కరించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. డెల్టా ప్రాంతంలో లైడార్‌ సర్వే కోసం రూ.13.4 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గోదావరి డెల్టా ఆధునీకరణ పనులపై మంగళవారం ఇరిగేషన్‌ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా గోదావరి జిల్లాల్లో ముంపు సమస్య, లాకులు, గేట్ల మరమ్మతులకు సమగ్ర డీపీఆర్‌ తయారు చేయాలని సంబంధిత ఏజెన్సీని ఆదేశించారు. మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో గోదావరి డెల్టా ఆధునీకరణకు నిధులున్నా.. పనులు చేయకపోవడమే కాకుండా సగంలో ఉన్న పనుల్ని ప్రీక్లోజర్‌ చేసి, 150 ఏళ్లలో గోదావరి డెల్టాకు ఎవరూ చేయనంత ద్రోహం చేసిందని అన్నారు. డెల్టా అభివృద్ధి, ఆధునీకరణ పనులకు సైంధవుడిలా జగన్‌ అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. ఆధునీకరణ పనులను మధ్యలోనే నిలిపివేయడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ముంపు సమస్య తలెత్తడంతో పాటు లాకులు, గేట్లు మరమ్మతు, డ్రెయిన్లలో పూడికతీత, ఏటిగట్లను పటిష్టం చేసే పనులు నిలిచిపోయి.. పంటలు నాశనమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. గోదావరి డెల్టాకు పూర్వవైభం తీసుకొచ్చేలా వెంటనే లైడార్‌ సర్వే పూర్తి చేసి, డెల్టా ఆధునీకరణ పనులు మొదలుపెట్టేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


గత ప్రభుత్వంలో నిధులున్నా కూడా కాలువలు, డ్రెయిన్లలో మట్టి తీయకపోగా, లాకులు, షట్టర్లకు కనీసం గ్రీజు పెట్టడానికి రూపాయి కూడా విడుదల చేయలేదని మంత్రి మండిపడ్డారు. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్లను ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు రూ.150 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు. సమీక్షలో జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, గోదావరి డెల్టా సీఈ, ఎస్‌ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 05:53 AM