Minister Nimmala Rama Naidu: పరదాలు, బారికేడ్లు లేని ప్రజా ప్రభుత్వమిది
ABN , Publish Date - Nov 13 , 2025 | 05:05 AM
పరదాలు, దాపరికాలు ప్రజా ప్రభుత్వంలో ఉండవు. బారికేడ్లు పెట్టి ప్రజలను దూరంగా ఉంచడం మా తీరు కాదు అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు
ఇక్కడి స్థితిగతుల జనమందరికీ తెలియాలి
ప్రజల మధ్యనే అధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష
త్రిపురాంతకం, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘పరదాలు, దాపరికాలు ప్రజా ప్రభుత్వంలో ఉండవు. బారికేడ్లు పెట్టి ప్రజలను దూరంగా ఉంచడం మా తీరు కాదు’ అని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బుధవారం ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్ల పనుల పురోగతిపై సమీక్షించారు. ఆ సమయంలో లోపలికి వచ్చిన ప్రజలను అధికారులు బయటకు పంపడానికి ప్రయత్నించారు. కలుగజేసుకున్న మంత్రి నిమ్మల పై విధంగా వ్యాఖ్యానించారు. ప్రజల సమక్షంలోనే సమీక్ష చేద్దామంటూ అందరూ లోపలే కూర్చోవాలని ఆహ్వానించారు. ‘మీ నాయకత్వంలో అంకితభావంతో పనిచేస్తాం’ అని ఒక అధికారి అనగానే... ‘అలాంటి పొగడ్తలు అక్కర్లేదు. అలా గతంలో డబ్బులిచ్చి పొగిడించుకునేవారు. ఆ రోజుల నుంచి బయటకు రండి’ అని మంత్రి స్పష్టం చేశారు. ‘ఈనెల 7న వచ్చాను. ఐదు రోజుల వ్యవధిలోనే మళ్లీ వచ్చానంటే వెలిగొండ పట్ల ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపుతుందో మీరు అర్థం చేసుకోవాలి. అనుకున్న గడువులోగా వెలిగొండ పూర్తికి ఎవరికి వారు పనిచేయాలి. మన హయాంలో పనులు పూర్తిచేసి వెలిగొండ ద్వారా నీరివ్వగలిగితే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు. రూ.456 కోట్లతో ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ పనుల శంకుస్థాపన కార్యక్రమం ఈ నెలలోనే చేపట్టాలి. కార్యక్రమానికి సీఎం చంద్రబాబును ఆహ్వానిస్తాం. మళ్లీ నెలరోజుల్లోపే ప్రాజెక్టు పనుల పరిశీలనకు వస్తా. అప్పుడు సమీక్షలో మీ పనితీరు తెలుస్తుంది. పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే... నిర్వహణ ఏజెన్సీ అయినా, అధికారులైనా... వేటు తప్పదు’ అని మంత్రి నిమ్మల హెచ్చరించారు.
కేంద్ర మంత్రి నిర్మలతో మంత్రి నారాయణ భేటీ
అమృత్ పథకం నిధులు, 15వ ఆర్థిక సంఘం పెండింగ్ నిధులు విడుదల చేయాలని మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలతో కలసి కేంద్ర మంత్రితో ఆమె కార్యాలయంలో భేటీ అయ్యారు. నిధులు విడుదలకు సంబంధించి తాను చేసిన విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి నారాయణ మీడియాకు తెలిపారు.