Minister Nimmala: వరదలతో ఏపీకి ఏటా వేల కోట్ల నష్టం
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:08 AM
వరదల కారణంగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం రూ.2వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకూ నష్టం వాటిల్లుతోందని, ఈ నష్టంలో వాటా ఎందుకు అడగడం లేదని బీఆర్‌ఎస్ నేతలను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు.
అందులో వాటా కావాలని బీఆర్‌ఎస్ అడగదేం?
ప్రాంతీయ విద్వేషాలు రగిల్చే యత్నం: మంత్రి నిమ్మల
అమరావతి/పాలకొల్లు, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): వరదల కారణంగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం రూ.2వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకూ నష్టం వాటిల్లుతోందని, ఈ నష్టంలో వాటా ఎందుకు అడగడం లేదని బీఆర్‌ఎస్ నేతలను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శుక్రవారం రాత్రి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలవరం- బనకచర్ల అనుసంధానంపై బీఆర్‌ఎస్ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని అంతర్గత రాజకీయ వైరాలను ఏపీపై రుద్దవద్దని కోరారు. సముద్రంలోకి వృథాగా పోయే గోదావరి జలాలను వినియోగించుకుంటే తప్పేంటని ఆ పార్టీ నాయకుడు హరీశ్‌రావును నిమ్మల నిలదీశారు. పోలవరం- బనకచర్ల అనుసంధానంతో ఎగువ రాష్ట్రాలకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. 1975 నుంచి గత 50 ఏళ్లలో 1,53,000 టీఎంసీల జలాలు సముద్రంలోకి వృథాగా పోయాయని వివరించారు. ఈ ఏడాది ఇప్పటికే 600 టీఎంసీలు వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చిన వరద జలాలను వినియోగించుకోకపోతే నేరుగా సముద్రంలోకి వెళ్లిపోతాయని చెప్పారు. గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు పోలవరం-బనకచర్ల అనుసంధానం దోహదపడుతుందని తెలిపారు. త్వరలో తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఉండటంతో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదమ్ముల్లాంటి తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు. కాళేశ్వరం, సీతారామసాగరం వంటి అనేక ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండానే నిర్మించుకుందని గుర్తుచేశారు. ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న పోలవరం- బనకచర్లపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమను గోదావరి జలాలతో రతనాల సీమ చేస్తానని అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన కేసీఆర్ నేడు మాట మార్చడం సమంజసమేనా అని నిమ్మల ప్రశ్నించారు.