Minister Narayana: నివేదికల రూపకల్పన కీలకం
ABN , Publish Date - Sep 27 , 2025 | 04:59 AM
సుస్థిర నగరాల నిర్మాణానికి నివేదికల రూపకల్పన అత్యంత కీలకమని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. రాష్ట్రంలో సుస్థిర నగరాల నిర్మాణానికి అవసరమైన...
సుస్థిర నగరాల నిర్మాణాలపై మంత్రి నారాయణ
ఎస్పీఏవీతో మున్సిపల్‌శాఖ ఎంఓయూ
అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సుస్థిర నగరాల నిర్మాణానికి నివేదికల రూపకల్పన అత్యంత కీలకమని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. రాష్ట్రంలో సుస్థిర నగరాల నిర్మాణానికి అవసరమైన నివేదికల రూపకల్పనకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ సహకరించనుంది. దీనికి సంబంధించి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, విజయవాడ మధ్య శుక్రవారం సచివాలయంలో మంత్రి నారాయణ సమక్షంలో అవగాహన ఒప్పందం జరిగింది. మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ సిరికొండ రమేష్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. మున్సిపల్‌శాఖలో ఉన్న పట్టణ ప్లానింగ్, ఇతర విభాగాలు అధునాతన సాంకేతికత, పరిశోధనలకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు. అమరావతితో పాటు భవిష్యత్తుకు అవసరమైన పట్టణాభివృద్ధికి ప్లానింగ్ స్కూల్ సహకరిస్తుందన్నారు. పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మించనున్న మెట్రో ప్రాజెక్టులు పర్యావరణ హితంగా ఉండేలా స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సహకరిస్తుందని తెలిపారు. నగరాల్లో జీఐఎస్ మాస్టర్ ప్లాన్‌ల తయారీకి ఎస్పీఏ సహకరిస్తుందన్నారు. ఈ ఎంఓయూ ద్వారా శాఖాపరంగా వచ్చే కీలక మార్పుల ద్వారా దేశంలోనే సుస్థిర పట్టణాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.