Minister Narayana: రాజధాని రైతుల ప్లాట్లలో మౌలిక వసతులు
ABN , Publish Date - Dec 10 , 2025 | 06:22 AM
రాజధాని రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఏడాదిలోగా మౌలిక వసతుల కల్పన పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు.
ఏడాదిలోగా పనులు పూర్తి చేస్తాం : మంత్రి నారాయణ
తుళ్లూరు, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాజధాని రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఏడాదిలోగా మౌలిక వసతుల కల్పన పూర్తవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. రాజధానిలో జరుగుతున్న రోడ్ల నిర్మాణాలు, రైతుల ప్లాట్ల అభివృద్ధి పనులను అధికారులు, ఇంజనీర్లతో కలిసి మంగళవారం పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు పెండింగ్ పనులు, గుంటూరు చానల్‌పై మంగళగరి రోడ్డును సీడ్ యాక్సిస్ రహదారితో కలిపేలా నిర్మిస్తున్న స్టీల్ వంతెన పనులను మంత్రి పరిశీలించారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఇప్పటికే ప్లాట్ల కేటాయింపు తుది దశకు చేరుకుందని నారాయణ చెప్పారు. మొత్తం 29 గ్రామా ల రైతులకు ఎల్పీఎస్ లేఅవుట్‌లను 13 జోన్లుగా విభజించి అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఈ ప్లాట్లలో ఏడాదిలోగా డ్రైనేజీలు, ఇతర పనులు పూర్తవుతాయని వివరించారు. మరో ఏడాదిన్నరలోగా రోడ్ల నిర్మాణాలు కూడా పూర్తవుతాయని తెలిపారు. ఒక్కటి మినహా మిగతా జోన్లలో రోడ్ నెట్‌వర్క్, తుఫాను నీటి కాలువలు, మురుగునీటి నెట్‌వర్క్, తాగునీరు, ఎస్టీపీలు, వంతెనల నిర్మా ణం కోసం మొత్తం రూ.23,645.56 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు రుణాల జారీపై బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని చెప్పారు.
కరకట్ట ప్రయాణం తగ్గిస్తాం
‘ప్రస్తుతం విజయవాడ నుంచి అమరావతి రాజధానిలోకి వెళ్లాలంటే ప్రకాశం బ్యారేజీ దిగువన కరకట్ట మీదుగా సీడ్ యాక్సిస్ రోడ్డులోకి వెళ్లాల్సి వస్తోంది. ఈ నెలాఖరు నాటికి సీడ్ యాక్సిస్ రోడ్డును మరికొంతమేర అందుబాటులోకి తీసుకువచ్చి కరకట్ట ప్రయాణం తగ్గిస్తాం. ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి సెంటర్ మధ్యలో సీడ్ యాక్సిస్ రోడ్డును అనుసంధానించేలా గుంటూరు చానల్‌పై స్టీల్ వంతెన నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఫిబ్రవరి 15 నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తయితే అసలు కరకట్టతో సంబంధం లేకుండానే రాజధానిలోకి నేరుగా వెళ్లిపోవచ్చు.’ అని నారాయణ తెలిపారు. రాజధానికి భూములిచ్చిన 29,233 మంది రైతులకు 69,421 ప్లాట్లు కేటాయించామని తెలిపారు. వీటిలో ఇప్పటివరకు 27,105 మందికి 61,753 ప్లాట్ల రిజిస్ర్టేషన్ పూర్తయిందని చెప్పారు. ఇంకా 2,128 మంది రైతులకు చెందిన 7,668 ప్లాట్లు మాత్రమే రిజిస్ర్టేషన్ చేయాల్సి ఉందన్నారు. దీనిపై రైతులకు సమాచారం ఇస్తున్నామన్నారు.