Share News

Minister Narayana: అధికారుల భవనాలు మార్చి నాటికి పూర్తి

ABN , Publish Date - Sep 25 , 2025 | 06:45 AM

అమరావతిలో అధికారుల కోసం నిర్మించిన భవనాలను మార్చి నెలాఖరుకు పూర్తిచేస్తామని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు.

Minister Narayana: అధికారుల భవనాలు మార్చి నాటికి పూర్తి

  • అమరావతిలో పురోగతిలో 85 రకాల పనులు

  • టీడీఆర్‌ బాండ్ల సమస్యకు త్వరలో పరిష్కారం

  • జీవీఎంసీలో పది జోన్లు: మంత్రి నారాయణ

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): అమరావతిలో అధికారుల కోసం నిర్మించిన భవనాలను మార్చి నెలాఖరుకు పూర్తిచేస్తామని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు బుధవారం ఆయన సమాధానాలిచ్చారు. రాజధానిలో ఇప్పటివరకూ 35వేల ఎకరాలు సమీకరించామన్నారు. గతంలో నిర్మించి మధ్యలో నిలిచిపోయిన భవనాల స్థితిపై అధ్యయనం చేయించామని, అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచామని, ఇందులో సబ్‌ కాంట్రాక్టులు ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. టిడ్కో ఇళ్ల బకాయిలు రూ.350 కోట్లు చెల్లించామని, అమరావతికి అదనపు నిధులు ఉన్నందున త్వరితగతిన చెల్లింపులు జరుగుతున్నాయని వివరించారు. అమరావతిలో మొత్తం 85 రకాల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.


జీవీఎంసీలో 10వేల మంది ఉద్యోగులు..

గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 10 జోన్లు ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకున్నామని, త్వరలో అమల్లోకి తీసుకొస్తామని మంత్రి నారాయణ తెలిపారు. జీవీఎంసీలో మొత్తం 10వేల మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని, 4,863 కిలోమీటర్ల రహదారులు అవసరం కాగా 3,523 కిలోమీటర్లు అందుబాటులో ఉన్నాయని, 193 కిలోమీటర్ల పనులు జరుగుతున్నాయని చెప్పారు. టీడీఆర్‌ బాండ్ల విషమంలో నగరంలో రెండు విస్తరణ పనులు జరిగాయని, వాటిలో 149 ఆస్తుల్లో 97 ఆస్తులకు బాండ్లు జారీచేశామని తెలిపారు. సింహాచలం పరిధిలో బాండ్ల జారీకి దేవదాయశాఖతో చర్చిస్తామన్నారు. జీవీఎంసీ పరిధి పెరిగినందున, ఉద్యోగుల్లేక పనులు జరగడం లేదని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. జోనల్‌ కమిషనర్ల పరిధిని నియోజవర్గాలవారీగా మార్చాలని కోరారు. అరిలోవలో తాగునీటి సమస్య పరిష్కారానికి కణితి రిజర్వాయర్‌ నుంచి నీరిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు అడిగినా పురపాలక మంత్రి స్పందించడం లేదని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అన్నారు. టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంపై విజిలెన్స్‌ నివేదికను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. జోనల్‌ కమిషనర్లకు నిధులు విడుదల చేసే అధికారాలు కల్పించాలని ఎమ్మెల్యే గణబాబు కోరారు. టీడీఆర్‌ బాండ్ల అంశంపై రాష్ట్ర స్థాయి కమిటీని నియమించాలని పల్లా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. వైసీపీ హయాంలో భూములు లేకపోయినా ఇచ్చినట్లుగా చూపించి టీడీఆర్‌ బాండ్లు తీసుకున్నారని కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. దీనిపై నివేదికను సభలో పెట్టాలని కోరారు.


అమరావతిపై జగన్‌ వైఖరి చెప్పాలి: కామినేని

గత ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా పేరున్న వ్యక్తి తాజాగా రాజధాని అమరావతేనని చెప్పారని, జగన్‌ కూడా అమరావతిపై వైఖరి ప్రకటించాలని కామినేని శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. అమరావతికే కట్టుబడి ఉంటారా? లేక మళ్లీ మూడు ముక్కలాట ఆడతారా? అనేది ప్రజలకు తెలియాలన్నారు. రాష్ట్రంలోని కాంట్రాక్టర్లందరికీ రాజధాని కాంట్రాక్టులు ఇవ్వాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు డిమాండ్‌ చేశారు. 9 మంది కాంట్రాక్టర్లకే అన్ని పనులు ఇస్తే మిగిలిన వారు ఎలా బతకాలని ప్రశ్నించారు.

రేపు ఎమ్మెల్యేల నుంచి పిటిషన్లు..

నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు అందిన పిటిషన్లను శుక్రవారం అసెంబ్లీలో పిటిషన్ల కమిటీ స్వీకరిస్తుందని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎమ్మెల్యేలు ముఖ్యమైన పిటిషన్లు కమిటీకి ఇచ్చే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Updated Date - Sep 25 , 2025 | 06:47 AM