Minister Narayana : అమరావతిలో 6,473 వేల కోట్లతో పనులు
ABN , Publish Date - Mar 12 , 2025 | 04:21 AM
రాజధాని అమరావతిలో మొత్తం రూ. 64,721 కోట్లతో 73 పనులను అంచనా వేశామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు.

మూడేళ్లలో నిర్మాణాల పూర్తికి ప్రణాళికలు
రెండేళ్లలో ప్రధాన రోడ్లు పూర్తి
రాజధానిలో 31 సంస్థలకు భూములు
ఆర్-5లో సెంటు భూమి తీసుకున్న వారికి వేరే చోట భూమి: మంత్రి నారాయణ
39 వేల కోట్ల విలువైన 63 పనులకు టెండర్లు
అసెంబ్లీలో మంత్రి నారాయణ వెల్లడి
అమరావతి/విజయవాడ(ఇబ్రహీంపట్నం), మార్చి 11(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో మొత్తం రూ. 64,721 కోట్లతో 73 పనులను అంచనా వేశామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ఆ 73 పనుల్లో 63 పనులకు టెండర్లు పూర్తి చేశామన్నారు. వాటి విలువ రూ. 39,678 కోట్లని వివరించారు. అమరావతిలో నిర్మాణాలపై అసెంబ్లీలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సల భవనాల నిర్మాణాలు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు. సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో పనులకు ఆమోదం తెలిపి సంస్థలకు లేఖలు ఇస్తామని తెలిపారు. అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రూ. 13,400 కోట్లు ఇవ్వడానికి అనుమతిచ్చాయన్నారు. కేఎ్‌ఫడబ్ల్యూ బ్యాంక్ రూ. 5 వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 11 వేల కోట్లు అనుమతివచ్చిందని, వాటితో అగ్రిమెంట్ చేసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద రూ. 1560 కోట్లు ఇస్తుందన్నారు. ఇవి కాకుండా మార్టుగేజ్, లీజుల ద్వారా వివిధ సంస్థల నుంచి అమరావతి నిర్మాణానికి నిధులు సేకరిస్తున్నామన్నారు. అమరావతిని మూడేళ్లలో పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. రెండేళ్లలో మెయిన్ రోడ్డులు, మూడేళ్లలో అంతర్గత రోడ్లు పూర్తి చేస్తామన్నారు. అసెంబ్లీ, హైకోర్టు మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. తాము 2014-19లో 131 సంస్థలకు 1,277 ఎకరాలు ఇచ్చామని, గత ఐదేళ్ల పరిణామాలవల్ల కొందరు వెనక్కి వెళ్లారని, ఇపుడు 31 సంస్థలకు 629 ఎకరాలు భూమి ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం ఆర్-5 జోన్‌లో 50 వేల మందికి ఒక సెంటు భూమి అమరావతిలో ఇచ్చారని,వారికి వేరేచోట భూమి కేటాయిస్తామన్నారు.
నాడు జగన్ ఒప్పుకొన్నారు
అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత జగన్ అమరాతిలోనే రాజధాని ఉండాలని, 30 వేల ఎకరాలు అవసరమని అసెంబ్లీలో ఒప్పుకొన్నారని నారాయణ చెప్పారు. ప్రభుత్వం మారగానే మూడు ముక్కలాట ఆడి రైతులను ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. ఐదేళ్లలో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. రైతులకు సుజనా చౌదరి అండగా నిలిచారని అన్నారు. తాము 2015 జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ లోగా కేవలం 58 రోజుల్లో 34 వేల ఎకరాలు సేకరించామని పేర్కొన్నారు. కేవలం సీఎం చంద్రబాబుపై నమ్మకంతో రైతులు భూమి ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎనిమిది నెలల్లో సమస్యలు పరిష్కరించి టెండర్లు ఆహ్వానించామన్నారు. ఇక పుత్తూరు మున్సిపాలిటీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరుగుతోందని మంత్రి చెప్పారు. టెండర్లు పిలవకుండానే ఎస్‌ఎస్ ట్యాంక్‌బండ్ మరమ్మత్తు పనిలో రూ. 45.82 లక్షలు పూర్తి చేశారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడారు. వైసీపీది అరాచపాలన అని మండిపడ్డారు. అమరావతి రైతుల బాధలు విని ఐదేళ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగామన్నారు. తాను అమరావతిలో అంగుళంభూమి కొనడంగానీ, అమ్మడంగానీ చేయలేదన్నారు.అమరావతిని రెరాచట్టం కిందకు తీసుకురావాలని, రైతులకు జరిగిన నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారో చెప్పాలని కోరారు.
కేబినెట్ ఆమోదం తర్వాత పనులు: నారాయణ
అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించిన రూ. 37,702.15 కోట్ల విలువైన 59 టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ నెల 17న జరిగే కేబినెట్‌లో వీటన్నింటికీ ఆమోదం పొంది వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఏప్రిల్‌లో 20 వేల మంది అమరావతి అభివృద్ధి పనుల్లో పాల్గొంటారన్నారు. సీఎం అధ్యక్షతన 45వ సీఆర్డీఏ సమావేశం జరిగిందని తెలిపారు. ఈసమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. 59 టెండర్లలో సీఆర్డీఏకు చెందిన 22 పనుల విలువ దాదాపు రూ. 22,607.11 కోట్లు అని, ఏడీసీకి చెందిన 37 పనుల విలువ దాదాపు రూ. 15,095.04 కోట్లని ఆయన తెలిపారు. సీఆర్డీఏకు చెందినవి 24 పనులు కాగా ప్రస్తుతానికి 22 పనులకు సంబంధించిన టెండర్లను మాత్రమే ఓపెన్ చేశామన్నారు. మిగిలిన 2 పనులకు ఈనెల 17న టెండర్లు ఓపెన్ చేస్తామన్నారు. అవికాక ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ బిడ్జ్, జాతీయ రహదారి నిర్మాణం తదితర పనులకు దాదాపు రూ. 16,871.52 కోట్లు విలువైన మరో 19 పనులకు ఈనెలాఖరు లోపు టెండర్లు పిలిచి పనులను చేపడతామన్నారు.