Nara Lokesh : పారిశుధ్యంపై ప్రజల్లో చైతన్యం పెరగాలి
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:27 AM
పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజల్లో మరింత చైతన్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

అవగాహన కోసం మంగళగిరిలో ఇంటింటి ప్రచారం
స్వచ్ఛతలో ఆదర్శ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతాం
‘ స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’లో మంత్రి లోకేశ్
పార్కులో స్వయంగా చెత్తను ఊడ్చి, ఎత్తిన మంత్రి
మంగళగిరి/నంద్యాల నూనెపల్లె/అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజల్లో మరింత చైతన్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విదేశాల్లో ఎవరూ చెత్తను ఇష్టమొచ్చినట్లు బయట వేయరని చెప్పారు. పారిశుధ్యంపై అవగాహన కోసం మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని ఎకో పార్కులో శనివారం మంత్రి స్వయంగా చెత్తను ఊడ్చి ఎత్తి చెత్తకుండీలో వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వచ్ఛతలో మంగళగిరిని ఆదర్శ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతామన్నారు. పారిశుధ్య నిర్వహణకు ప్రజారోగ్యానికి మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలా వ్యాధులను నివారించే వీలవుతందని చెప్పారు. మంగళగిరిలో త్వరలోనే భూగర్భ డ్రైనేజి, అండర్ వాటర్, గ్యాస్, పవర్ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన పనులను చేపడతామన్నారు. అలాగే మంగళగిరి ప్రాంతంలోని చెరువులను రూ. 3 కోట్లతో ఆధునీకరిస్తామని లోకేశ్ తెలిపారు. ప్రజలంతా నిద్రకు ఉపక్రమించిన తరువాత పారిశుధ్య కార్మికులు పరిసరాలను పరిశుభ్రంగా మార్చే కఠినతరమైన పనులను చాలా ఇష్టంగా చేస్తున్నారంటూ వారందరినీ ఈ సందర్భంగా ప్రశంసించారు. పారిశుధ్య నిర్వహణలో మంగళగిరిని నం.1 చేస్తామన్నారు.
పారిశుధ్య కార్మికుడితో లోకేశ్ ఇష్టాగోష్ఠి
స్థానిక పారిశుధ్య కార్మికుడు ఎం.నాగార్జునతో కలిసి మంత్రి లోకేశ్ ఎకో పార్కులో చెత్తను ఊడ్చి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా అతడితో కాసేపు ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. ఏ ఊరు? ఎక్కడెక్కడ పనిచేస్తున్నారంటూ మంత్రి ప్రశ్నించగా.. తాను మంగళగిరి 16వ వార్డులో నివాసం ఉంటున్నానని, గత 15 ఏళ్లుగా మంగళగిరిలోనే పారిశుధ్య కార్మికునిగా పనిచేస్తున్నానని చెప్పారు. తన ఇద్దరు పిల్లలు ప్రభుత్వ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారని వివరించారు. ప్రభుత్వ బడుల్లో విద్యాబోధన బాగుందన్నారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం ఇంకా బాగుందని నాగార్జున మంత్రికి వివరించారు. పారిశుధ్య పనుల నిర్వహణలో ఏవైనా సమస్యలున్నాయా అంటూ మంత్రి లోకేశ్ అడుగగా.. చేతికి వేసుకునే గ్లవ్స్ మరింత మందంగా ఉండాలని నాగార్జున సూచించారు. ఈ ముఖాముఖి అనంతరం పారిశుధ్య కార్మికుడు నాగార్జునను మంత్రి లోకేశ్ ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఎకోపార్కులో వాకింగ్ చేసే నేచర్స్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు లోకేశ్‌ను కలిశారు. వాకర్స్ కోసం లోకేశ్ తన సొంత నిధులు రూ. 5 లక్షలు వెచ్చించి ఉచిత ప్రవేశాన్ని కల్పించినందుకుగాను కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంటీఎంసి కమిషనరు షేక్ అలీం బాషా, అదనపు కమిషనరు ఎం.శకుంతల తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రమైన ఏపీకి కృషి: సీఎస్ విజయానంద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పిలుపునిచ్చారు. శనివారం నంద్యాల జిల్లా కేంద్రంలో పెద్దచెరువు కట్టపై ‘స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమానికి సీఎస్ విజయానంద్, జిల్లా స్పెషల్ అధికారి నివాస్ హాజరయ్యారు. మొక్కలు నాటి, చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేశారు. నంద్యాలలోని ఈద్గా మైదానం వద్ద రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రితో కలసి సీఎస్ విజయానంద్ మొక్కలు నాటారు. పర్యావరణం, పచ్చదనం, పరిశుభ్రతకు ఊతమిచ్చేలా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్రను పెద్దఎత్తున నిర్వహించారు. రాష్ట్ర పీసీబీ చైర్మన్ పి.కృష్ణయ్య ఆధ్వర్యంలో ఆ సంస్థ రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లోనూ స్వచ్ఛ కార్యక్రమాలు జరిగాయి. తాడేపల్లిలోని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యాలయంలో పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువులను సంస్థ ఎండీ కూర్మనాథ్, సిబ్బంది తొలగించారు.