Minister Nara Lokesh: వైసీపీ పాలనలో చీకటి రాజ్యం
ABN , Publish Date - Nov 09 , 2025 | 04:48 AM
ఐదేళ్ల వైసీపీ పాలనలో చీకటి రాజ్యం చూశామని, జగన్ పాలనపై బీసీలు మాట్లాడితే దాడులు చేశారని, పెట్రోలు పోసి తగలబెట్టారని మంత్రి లోకేశ్ అన్నారు. ఆ చీకటి పాలనను అంతమొందించేందుకు బీసీలు తిరుగుబాటు...
బీసీలు మాట్లాడితే దాడులు చేశారు
పెట్రోలు పోసి తగలబెట్టారు
ఆ వర్గాల్లో తిరుగుబాటుతోనే కూటమి గెలుపు
కురుబలకు ఇచ్చిన హామీ మేరకే రాష్ట్ర పండుగగా కనకదాస జయంతి
టీటీడీ సహకారంతో బీరప్ప ఆలయాలను కట్టిస్తాం
గుడికట్ల పూజారులకు త్వరలో గౌరవ వేతనం
పవన్ కల్యాణ్‌తో మాట్లాడి కురుబలకు షెడ్లు వేయిస్తా
కల్యాణదుర్గంలో భక్త కనకదాస కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేశ్
ఘనంగా 538వ జయంతి వేడుకలు
అనంతపురం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల వైసీపీ పాలనలో చీకటి రాజ్యం చూశామని, జగన్ పాలనపై బీసీలు మాట్లాడితే దాడులు చేశారని, పెట్రోలు పోసి తగలబెట్టారని మంత్రి లోకేశ్ అన్నారు. ఆ చీకటి పాలనను అంతమొందించేందుకు బీసీలు తిరుగుబాటు చేసి కూటమిని గెలిపించారని వివరించారు. భక్త కనకదాస 538వ జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ప్రధాన కూడలిలో ఏర్పాటుచేసిన తొమ్మిది అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, కనకదాస తన గొప్ప పాటలతో శ్రీకృష్ణుడిని తనవైపు తిప్పుకున్నారని, అహంకారాన్ని వీడితే మోక్షం లభిస్తుందనే గొప్ప సూక్తిని చాటారని శ్లాఘించారు. యువగళం పాదయాత్రలో కురుబలకిచ్చిన హామీ మేరకు భక్త కనకదాస జయంతిని అధికారికంగా రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్నామని లోకేశ్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బీరప్ప దేవాలయాలను టీటీడీ సహకారంతో నిర్మిస్తామని, ఆ దేవాలయాల (గుడికట్ల) పూజారులకు త్వరలోనే గౌరవ వేతనం అందజేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని, వారిని అన్ని విధాలుగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కురబ సోదరులను మరువబోమని, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్నారు. ‘‘కురబలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్య్రం టీడీపీతోనే వచ్చింది. కురుబ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, ఆ వర్గాల అభ్యున్నతికి పనిచేశాం. దాదాపు రూ.300 కోట్లు వారికోసం ఖర్చుచేశాం. గొర్రెల కొనుగోలుకు సబ్సిడీ రుణాలు, బీమా అందించాం.
50 శాతం సబ్సిడీతో రూ.4 లక్షల వరకూ రుణ సౌకర్యం కల్పించాం. ఈ వర్గానికి చెందిన మంత్రి సవిత తండ్రి రామచంద్రారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో 14 శాఖలు నిర్వహించారు. ఆయన ఎంపీగానూ పనిచేశారు. మరో కురబ నేత బీకే పార్థసారథి ఎంపీగానే కాకుండా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. కురబ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు నాగరాజు కర్నూలు ఎంపీగా, బత్తిన వెంకటరాముడు జడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఎంతో మంది కురుబలకు స్థానం కల్పించిన పార్టీ టీడీపీ. ’’ అని లోకేశ్ తెలిపారు. కురబ సోదరుల కోసం కమ్యూనిటీ భవనాలను ఏడాదిలోపు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్రాలు బలపడితేనే దేశాభివృద్ధి
బిహార్ పారిశ్రామికవేత్తలు, చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశాల్లో మంత్రి లోకేశ్
అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం కూడా అభివృద్ధి సాధిస్తుందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే తరఫున ప్రచారం నిర్వహించేందుకు ఆయన శనివారం మధ్యాహ్నం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పర్యటన ముగించుకుని పట్నా పర్యటనకు వెళ్లారు. బిహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్, ఆ రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఎన్డీయేను గెలిపించాల్సిన ఆవశక్యతను వారికి వివరించారు. ఆయా సమావేశాల్లో లోకేశ్ మాట్లాడుతూ... దేశ ప్రజలు ప్రధానిగా సరైన సమయంలో సరైన నేతను ఎన్నుకున్నారని, దీంతో గత పదేళ్లుగా భారత్ అనూహ్యంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. బిహార్ కూడా నితీశ్‌కుమార్‌కు ముందు, తర్వాత అన్న విధంగా అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. సమర్థ నేత వల్లే బిహార్ అభివృద్ధి సాధిస్తోందని తెలిపారు. కాగా, ఆదివారం ఉదయం 10 గంటలకు పట్నాలో ఎన్టీఏకి మద్దతుగా లోకేశ్ విలేకరుల సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం అక్కడినుంచి బయలుదేరి విజయవాడ చేరుకుంటారు.
తిరుమలలో భక్త కనకదాస పీఠం
పెనుకొండ టౌన్, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): కురుబల ఆరాఽధ్య దైవం భక్త కనకదాస పీఠాన్ని తిరుమలలో ఏర్పాటు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో నిర్వహించిన కనకదాస 538వ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. కనకదాస విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తిరుమలలో రెండెకరాల్లో భక్తకనకదాస పీఠం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో మంత్రి లోకేశ్ చర్చించారని తెలిపారు. కురుబలకు, బీసీలకు ఆదరణ -3 లబ్ధి త్వరలో చేకూరుతుందని తెలిపారు.