Minister Nara Lokesh: ఆస్ట్రేలియాతో ఆక్వా బంధం
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:31 AM
ఏపీ ఆక్వా పరిశ్రమతో ఆస్ట్రేలియా బంధం బలపడాలని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. ఏపీలో సముద్ర ఆహార పరిశ్రమల నెట్ వర్కింగ్‌కు సహకరించాలని సీ ఫుడ్ ఇండస్ర్టీ ఆస్ర్టేలియా..
ప్రపంచవ్యాప్త నెట్ వర్కింగ్‌కు సహకరించండి
ఆధునిక పరిజ్ఞానాన్ని అందించండి.. ఆస్ట్రేలియా ‘సీఫుడ్’ ప్రతినిధులకు లోకేశ్ వినతి
వివిధ కంపెనీలతో వరుస భేటీలు.. విశాఖ పెట్టుబడిదారుల సదస్సుకు ఆహ్వానం
సత్వర అనుమతులు, ప్రోత్సాహకాలు.. హెచ్‌ఎస్‌బీసీ సీఈవో బృందంతో భేటీలో లోకేశ్
న్యూసౌత్‌వేల్స్, వెస్ట్రన్ సిడ్నీ వర్సిటీల సందర్శన.. స్మార్ట్ ఫార్మింగ్, నైపుణ్యాభివృద్ధికి
సహకరించాలని వినతి.. పారమట్టా మేయర్, న్యూసౌత్‌వేల్స్ ప్రీమియర్‌తో భేటీ
అమరావతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ఏపీ ‘ఆక్వా’ పరిశ్రమతో ఆస్ట్రేలియా బంధం బలపడాలని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. ఏపీలో సముద్ర ఆహార పరిశ్రమల నెట్ వర్కింగ్‌కు సహకరించాలని సీ ఫుడ్ ఇండస్ర్టీ ఆస్ర్టేలియా (ఎస్‌ఐఏ) ప్రతినిధులను కోరారు. ‘బ్రాండ్ ఏపీ’కి ప్రాచుర్యం కల్పించేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న లోకేశ్... సోమవారం, మంగళవారం బిజిబిజీగా గడిపారు. విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాలని ఆయా సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను వివరిస్తూ... సంబంధిత రంగాల్లో ఏపీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మంగళవారం పారమట్టాలో ఎస్‌ఐఏ సీఈవో వెరోనికా పాపకోస్టా, ఎంగేజ్‌మెంట్ మేనేజర్ జాస్మిన్ కెల్లేల, ఇతర ప్రతినిధులతో అయ్యారు. రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంపుదలకు తమతో కలిసి పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్‌లో ఏపీ అగ్రగామిగా ఉంది. ఆస్ర్టేలియాతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో ఏపీ ఆక్వాను అనుసంధానించేందుకు ట్రేడ్ మిషన్లు, నెట్ వర్కింగ్ కార్యక్రమాలను చేపట్టండి. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత, నిల్వ కాలం పెంచేందుకు ప్రాసెసింగ్, కోల్డ్‌చైన్ మేనేజ్‌మెంట్, ప్యాకేజింగ్ రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను పరిచయం చేయండి. ఏపీ సీ ఫుడ్ వంటకాలను ప్రోత్సహించి, కలినరీ టూరిజంను ఆకర్షించేందుకు సంయుక్త కార్యక్రమాలు చేపట్టండి’’ అని కోరారు. చంద్రబాబు నేతృత్వంలో పారిశ్రామిక పెట్టుబడులకు సానుకూల విధానాలు అమలు చేస్తున్నామని లోకేశ్ వెల్లడించారు.
పెట్టుబడిదారుల కోసం స్నేహపూర్వక విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు. హెచ్‌ఎ్‌సబీసీ సీఈవో ఆంటోనీ షా నేతృత్వంలోని బృందంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామని, 16 నెలల్లోనే రూ. 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వివరించారు. రాష్ట్రంలో 1,051 కిలో మీటర్ల సువిశాల సముద్ర తీరం పోర్టు ఆధారిత రంగానికి పెద్ద ఊతమని చెప్పారు. ఈ భేటీలో అమెజాన్ పబ్లిక్ పాలసీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆగ్నేయాసియా డైరెక్టర్ మైఖెల్ కూలే, సిస్కొ వైస్ ప్రెసిడెండ్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జెట్టి మురళి, రిచర్డ్ వాట్సన్ పాల్గొన్నారు.
నగరాల అభివృద్ధికి సహకరించండి
రాష్ట్రంలో ప్రధాన నగరాల అభివృద్ధికి సహకారం అందించాలని గ్రేటర్ సిడ్నీలో కీలక నగరం పారమట్టా లార్డ్ మేయర్ మార్టిన్ జైటర్‌ను లోకేశ్ కోరారు. తర్వాత హారీస్ పార్కులో లిటిల్ ఇండియా పేరిట ఏర్పాటు చేసిన రివర్‌ఫుడ్ కోర్టును ఆయన పరిశీలించారు. న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మీన్స్‌తో లోకేశ్ మంగళవారం సమావేశమయ్యారు. అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ స్టార్ట్‌పలు, గ్రీన్ టెక్నాలజీల్లో సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్-న్యూసౌత్‌వేల్స్ ఇన్నోవేషన్ అండ్ ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రాబోయే ఇన్నోవేషన్ హబ్ అండ్ స్టార్ట్‌పలతో విశాఖ, అనంతపురంలను అనుసంధానించే ఎక్స్చేంజీ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని అభ్యర్థించారు. రెన్యువబుల్ ఎనర్జీ, మెడ్‌టెక్, అగ్రిటెక్, లాజిస్టిక్ రంగాల్లో పనిచేస్తున్న న్యూసౌత్‌వేల్స్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలన్నారు. క్లీన్ టెక్, ఏఐ, ఇన్‌ఫ్రా రంగంలో పరిశోధనాభివృద్ధి కోసం న్యూసౌత్‌వేల్స్, ఆంధ్రప్రదేశ్ వర్సిటీల మధ్య అవగాహనతో సాంకేతికత, అనుభవాలను పంచుకోవాలని కోరారు.
రంగా వర్సిటీతో కలసి పనిచేయండి
వెస్ట్రన్ సిడ్నీ వర్సిటీని లోకేశ్ మంగళవారం సందర్శించి ఆ వర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, అగ్రికల్చర్ టెక్నాలజీ పరిశోధకులతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో వ్యవసాయ ఆధునికీకరణకు వెస్ట్రన్ సిడ్నీ వర్సిటీ వాతావరణ సానుకూల పంటలు, ప్రెసిషన్ ఫార్మింగ్ నైపుణ్యాలను ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలసి ఆలోచనలను పంచుకోవాలని కోరారు. రైతులు, పుణులకు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్, అగ్రిటెక్ ఇన్నోవేషన్‌లో శిక్షణ ఇచ్చేందుకు సంయుక్త కార్యక్రమాలు నిర్వహించాలని.. స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేసే ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నైపుణ్యాభివృద్ధిలో సహకరించండి
స్టెమ్, ఏఐ, రెన్యువబుల్ ఎనర్జీలో నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించాలని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (యూఎన్‌ఎ్‌సడబ్ల్యూ) అధ్యాపక బృందాన్ని మంత్రి లోకేశ్ కోరారు. రాష్ట్ర వర్సిటీలతో కలసి సంయుక్త డిగ్రీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆ యూనివర్సిటీని సందర్శించిన లోకేశ్.. అధునాతన బోధనా పద్ధతులపై అక్కడి సీనియర్ అధ్యాపక బృందంతో చర్చించారు. ఐటీ, తయారీ రంగాల్లో భాగస్వామ్యం వహించాలని కోరారు. సంయుక్త పరిశోధన, అభివృద్ధి సాంకేతిక నైపుణ్యాల పరిశోధనల్లో భాగస్వామ్యం కావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు టెలీ మెడిసిన్‌కు సహకరించాలని కోరారు. డేటా ఆధారిత పాలన, ప్రజా విధానాలపై సౌత్ వేల్స్ వర్సిటీతో కలసి చేయడానికి సిద్ధమన్నారు.