Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల వద్ద నో వేకెన్సీ బోర్డులే లక్ష్యం
ABN , Publish Date - Sep 23 , 2025 | 05:26 AM
ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులతో కళకళలాడేలా చేయడంతోపాటు వాటికి వెలుపల నో వేకెన్సీ బోర్డు పెట్టాలన్నదే తన లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
విద్యార్థులతో కళకళలాడేలా సర్కారు స్కూళ్లను మారుస్తాం
గత ప్రభుత్వ జీవో 117తో 10 లక్షల మంది విద్యకు దూరం
రాష్ట్రంలో ‘వన్ క్లాస్.. వన్ టీచర్’
వచ్చే రెండేళ్లలో అంతర్జాతీయ స్థాయిలో ‘అమరావతి లైబ్రరీ’
పాఠశాలల మౌలిక వసతులకు దాతల నుంచి విరాళాలు స్వీకరిస్తాం
స్కూళ్లకు వారి పేర్లు కూడా పెడతాం... శాసన సభలో లోకేశ్
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులతో కళకళలాడేలా చేయడంతోపాటు వాటికి వెలుపల ‘నో వేకెన్సీ’ బోర్డు పెట్టాలన్నదే తన లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 100 పాఠశాలల్లో సీట్లు నిండిపోయి.. ‘నో వేకెన్సీ’ బోర్డులు పెట్టారని చెప్పారు. రాష్ట్రంలోని 42 వేల పైచిలుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇదే విధమైన పరిస్థితి తీసుకొచ్చేలా పనిచేస్తున్నామన్నారు. శాసనసభలో సోమవారం గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో 117పై నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు అడిగిన ప్రశ్నకు లోకేశ్ సమాధానమిచ్చారు. ‘‘ప్రాథమిక విద్యకు గొడ్డలిపెట్టులా పరిణమించిన జీవో 117, జీవో 85లను రద్దు చేశాం. వాటి స్థానంలో ‘వన్ క్లాస్-వన్ టీచర్’ విధానం తీసుకొచ్చాం. గత ప్రభుత్వ జీవో 117 కారణంగా 10 లక్షల మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ‘లెర్నింగ్ అవుట్ కమ్స్’(చదువులో రాణించడం)లో రాష్ట్రం వెనుకబడింది. ప్రాథమిక విద్యకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్న జీవో 117ను రద్దు చేయాలని యువగళం పాదయాత్రలో పలువురు ఉపాధ్యాయులు కోరారు. దీనికి ప్రత్యామ్నాయంగా ‘వన్ క్లాస్-వన్ టీచర్’ విధానంలో ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో మా ప్రభుత్వం రాకముందు కేవలం 1,398 స్కూళ్లలో మాత్రమే ‘వన్ క్లాస్-వన్ టీచర్’ ఉండగా, మేం వచ్చిన తర్వాత 9,620 పాఠశాలలకు ఈ విధానాన్ని పెంచాం.
ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబంధించి గతంలో కేవలం 124 మాత్రమే ఉండగా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 729 పాఠశాలలను అప్‌గ్రేడ్ చేశాం. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను దేశానికే మోడల్‌గా మార్చాలని నిర్ణయించాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ‘మన బడి-మన భవిష్యత్తు’ కింద ప్రక్రియ ప్రారంభమైంది. పాఠశాలల్లో అవసరమైన అదనపు తరగతి గదులు, మౌలిక వసతులపై ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. వీటికోసం ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి దాతల ద్వారా పారదర్శక విధానంలో ఎస్‌ఎంసీల పర్యవేక్షణతో పాఠశాలల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. దాతలు ఇచ్చే నిధులను బట్టి ఆయా పాఠశాలలకు వారి పేర్లు పెట్టే ప్రతిపాదన కూడా ఉంది. పాఠశాలలకు ఇప్పటికే ‘స్టార్ రేటింగ్’ ఇచ్చే ప్రక్రియను ఏర్పాటు చేశాం. 1-స్టార్, 2-స్టార్ పాఠశాలలను మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత శాసనసభ్యులపై ఉంది. మౌలిక సదుపాయలతో పాటు హాజరు, పరీక్షలు, సామర్థ్యంతోపాటు విద్యార్థులు చదువుల్లో రాణించడంపై కూడా శ్రద్ధ పెడుతున్నాం. రాబోయే రోజుల్లో ప్రైవేట్ పాఠఠశాలల కన్నా మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది, మంచి ఫలితాలు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. విద్యార్థులు చదివే ప్రాథమిక పాఠశాలలు ఒక కిలో మీటరు కంటే ఎక్కువ దూరంలో ఉంటే రవాణా ఖర్చు కింద నెలకు రూ.600 చొప్పున 10 నెలలపాటు తల్లిదండ్రుల ఖాతాల్లో జమచేస్తాం. ఈ ఏడాది దాదాపు 70 వేల మంది విద్యార్థులకు ఈ రవాణా చార్జీలను అందజేస్తాం.’’ అని మంత్రి లోకేశ్ వివరించారు.
విశాఖలో ఆధునిక గ్రంథాలయం
రాష్ట్రంలో లైబ్రరీల అభివృద్ధి, సెస్సు, బకాయిలకు సంబంధించి ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, పల్లె సింధూరరెడ్డి, గణబాబు అడిగిన ప్రశ్నలకు లోకేశ్ సమాధానమిచ్చారు. ఈ అంశంపై స్వల్పకాలిక చర్చ పెట్టాల్సి ఉందన్నారు. అమరావతిలో రూ.150 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రస్థాయి గ్రంథాలయ నిర్మాణాన్ని చేపడుతున్నామని తెలిపారు. ఈ లైబ్రరీ నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో లైబ్రరీలకు సంబంధించి మౌలిక వసతులతో పాటు మ్యానుస్ర్కిప్టు(లిఖిత గ్రంథాలు) కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో గ్రంథాలయాల అభివృద్ధికి ‘శోభ డెవలపర్స్’ సంస్థ రూ.100 కోట్ల విరాళమిచ్చేందుకు ముందుకొచ్చిందని, మరింత మంది దాతల సహకారాన్ని కూడా తీసుకుని గ్రంథాలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖపట్నంలో రూ.20 కోట్లతో ఆధునిక గ్రంథాలయ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గ్రంథాలయాల్లో కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దీనికిగాను కార్టూనిస్టులతో కూడా చర్చలు జరిపామన్నారు.
మంగళగిరిలో మోడల్ లైబ్రరీ
మంగళగిరి నియోజకవర్గంలో మోడల్ లైబ్రరీ నిర్మాణం చివరి దశలో ఉందని, అక్టోబరులో ప్రారంభిస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీల నిర్మాణాలను చేపడతామన్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన 26 జిల్లా గ్రంథాలయాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రంథాలయ సెస్సు బకాయిలకు సంబంధించి 2022-23లో 40 శాతం, 2023-24లో 45 శాతం, ప్రస్తుత సంవత్సరంలో 52 శాతం మాత్రమే వసూలయ్యాయన్నారు. సీఎం సూచనల మేరకు డిజిటల్ లైబ్రరీలపై దృష్టి సారించామన్నారు. దీనికి సంబంధించిన యాప్‌ను వంద రోజుల్లో ఆవిష్కరిస్తామని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. లోకేశ్ హయాంలోనే గ్రంథాలయ సమస్య పరిష్కారం కావాలని కోరారు. గతంలో పుస్తకాలు కొనుగోలు చేసినా.. రూ.1.70 కోట్లు బకాయి పెట్టారని, ఆ సొమ్మును చెల్లించాల్సి ఉందన్నారు. ఎమ్మెల్యే సింధూరరెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు.