Minister Nadendla Manohar: జగన్ పాలనలో పులివెందులలో 21 మంది కౌలు రైతుల ఆత్మహత్యలు
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:52 AM
సొంత నియోజకవర్గం పులివెందులలో గత వైసీపీ ప్రభుత్వంలో కౌలు రైతులు 21 మంది ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలను ఆదుకోని దుర్మార్గుడు మాజీ సీఎం జగన్ అని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
వారి కుటుంబాలను ఆదుకోని దుర్మార్గుడు జగన్: నాదెండ్ల
రైల్వేకోడూరు, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ‘సొంత నియోజకవర్గం పులివెందులలో గత వైసీపీ ప్రభుత్వంలో కౌలు రైతులు 21 మంది ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలను ఆదుకోని దుర్మార్గుడు మాజీ సీఎం జగన్’ అని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. సోమవారం రైల్వేకోడూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పగడాల వరలక్ష్మి ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘గత ప్రభుత్వంలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ.లక్ష చొప్పున పంపిణీ చేశారు. పులివెందులలో మృతి చెందిన రైతు కుటుంబాల కోసం సిద్ధవటంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 21 మంది కౌలు రైతులను గుర్తించి రావాలని సమాచారం అందిస్తే 17 మందే వచ్చారు. మిగిలిన వారిని వైసీపీ నాయకులు భయభ్రాంతులకు గురిచేశారు. ఉమ్మడి కడప జిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం’ అని మంత్రి మనోహర్ అన్నారు.