Share News

Minister Nadendla : 4 గంటల్లోనే రైతులకు ధాన్యం సొమ్ము

ABN , Publish Date - Nov 26 , 2025 | 06:02 AM

ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు.

Minister Nadendla : 4 గంటల్లోనే రైతులకు ధాన్యం సొమ్ము

  • డిసెంబరు నెలాఖరుకు కొనుగోళ్లు పూర్తి: మంత్రి నాదెండ్ల మనోహర్‌

దివాన్‌చెరువు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు చేసిన నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని సంపత్‌నగరం రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన్నారు. ప్రస్తుత దాళ్వా సీజన్‌లో యూరియా కొరత ఉండదని, కారణం 152 శాతం అధికంగా కేంద్రం నుంచి తీసుకున్నామని తెలిపారు. యూరియాపై కొంతమంది చేసే దుష్ప్రచారాలను నమ్మవద్దని రైతులకు సూచించారు. గత ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాలకోసం రైతులను ఓటు బ్యాంకుగా మార్చుకుని ఎన్నికలకు ముందు అనేక ఇబ్బందులు పెట్టిందంటూ గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో గోనెసంచులు లేకపోవడం, దూరప్రాంతాల మిల్లులకు లింక్‌ చేయడం వంటి సమస్యలు రైతులను అనేక ఇక్కట్లకు గురి చేశాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో 51 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ మేరకు 7 కోట్ల 54 లక్షల గోనె సంచులు రైతు సేవా కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు డిసెంబరు 31వ తేదీనాటికి నాటికి పూర్తి చేయాలని మంత్రి మనోహర్‌ కోరారు.

Updated Date - Nov 26 , 2025 | 06:03 AM