Minister Mandipalli: క్యాబినెట్‌లో మంత్రి మండిపల్లి కన్నీరు
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:50 AM
రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా తొలగించడంపై క్యాబినెట్ సమావేశంలోనే మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు..
జిల్లా కేంద్రంగా రాయచోటిని తీసేయడంపై ఆవేదన
అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా తొలగించడంపై క్యాబినెట్ సమావేశంలోనే మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. ఇప్పటి వరకు జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని ఇప్పడు మార్చడం వల్ల.. తాము జిల్లా కేంద్రవాసులమని ఇంతకాలం భా విస్తూ వచ్చిన రాయచోటి ప్రజలు సెంటిమెంట్‌గా భావిస్తారన్నారు. మంత్రి కన్నీటిపర్యంతం అవ్వడంతో సమావేశంలో స్తబ్దత ఏర్పడింది. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని మంత్రిని ఓదార్చారు. రాయచోటిని జిల్లా కేంద్రంస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంగా ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందో.. మార్పు చేయకుంటే సాంకేతికతంగా తలెత్తే ఇబ్బందులు ఏమిటో మంత్రికి చంద్రబాబు వివరించా రు. క్యాబినెట్ అనంతరం మండిపల్లి కన్నీళ్లతోనే బయటకు వచ్చారు. కొద్దిసేపటికే సీఎం చంద్రబాబు పేషీ నుంచి ఆయనకు ఫోన్ చేసి... సీఎంను కలవాలని సమాచారం ఇచ్చారు. దీంతో తిరిగి సీఎం పేషీకి వచ్చిన మండిపల్లి, సీఎంతో భేటీ అయ్యారు.
పార్టీ, ప్రజలు నాకు 2 కళ్లు: మండిపల్లి
సీఎంతో భేటీ అనంతరం మంత్రి మండిపల్లి మాట్లాడారు. ‘నాకు పార్టీ, నియోజకవర్గ ప్రజలు రెండు కళ్లు. రాయచోటి విషయంలో బాధ పడుతున్నట్లు సీఎం కూడా చెప్పారు. అక్కడ ఉన్న 3 నియోజకవర్గాల పరిస్థితులు వేర్వేరుగా ఉన్నాయ. రైల్వేకోడూరు ప్రజలు తిరుపతిని, రాజంపేట ప్రజలు కడపను కోరుకోవడంతో రాయచోటి ఏకాకి అయింది. నవంబరు 27న వచ్చిన గెజిట్‌లో జిల్లా కేంద్రం మార్పు లేదు. మాకు స్వార్థం ఉంటే ఆరోజే మార్పు చేసే వాళ్లం.’ అన్నారు.