Minister Lokesh: విద్యారంగంలో కోనసీమను ముందుకు తీసుకెళ్తాం
ABN , Publish Date - Sep 27 , 2025 | 06:26 AM
విద్యారంగంలో కోనసీమ ప్రాంతా న్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి లోకేశ్ శాసనసభలో తెలిపారు.
పాలిటెక్నిక్ కాలేజీలు, ఇతర విద్యాసంస్థల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటాం: అసెంబ్లీలో మంత్రి లోకేశ్
అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): విద్యారంగంలో కోనసీమ ప్రాంతా న్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి లోకేశ్ శాసనసభలో తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు, ఇతర విద్యాసంస్థల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల్లో సమయంలో మంత్రి సమాధానాలు ఇచ్చారు. కోనసీమలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యారంగం వెనకబడి ఉందన్నారు. పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటుపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి నూతన సిలబ్‌సను తీసుకొస్తామని తెలిపారు.
ఎస్కేయూలో అక్రమాలపై చర్యలు
గత ప్రభుత్వంలో ఎస్‌కే యూనివర్సిటీలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులు అందాయని లోకేశ్ పేర్కొన్నారు. వర్సిటీలో పదోన్నతులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, కంప్యూటర్ కొనుగోళ్లు, వాహనాల దుర్వినియోగం వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నామని, 100 రోజుల్లోగా తగిన చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థి మృతి బాధాకరమ ని మంత్రి లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. దాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. వర్సిటీల్లో రాజకీయాలు వద్దని హితవు పలికారు. ఏవైనా సమస్యలు ఉంటే విద్యార్థి సంఘాలు ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుకోవాలన్నా రు. యూనివర్సిటీల పనిని ఇబ్బంది పెట్టాలనుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వర్సిటీల్లో 3,282 పోస్టులు ఖాళీగా ఉన్నాయని లోకేశ్ వెల్లడించారు. వివిధ కోర్టు కేసుల కారణంగా పోస్టుల భర్తీలో జాప్యం జరుగుతోందని వివరించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబరు 26న విద్యార్థులతో అసెంబ్లీ నిర్వహించాలని మంత్రి లోకేశ్ ప్రతిపాదించారు.