Minister Lokesh: ఓటు వృథా కానివ్వొద్దు
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:35 AM
ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను పూర్తి మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు మంత్రి లోకేశ్ సూచించారు.
ఉప రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ వేళ జాగ్రత్త
టీడీపీ ఎంపీలకు మంత్రి లోకేశ్ సూచన
న్యూఢిల్లీ, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ను పూర్తి మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు మంత్రి లోకేశ్ సూచించారు. పోలింగ్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నందున ఓటింగ్ వేళ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, పార్టీ ఎంపీలు వేసే ఓట్లు వృథా కారాదని అన్నారు. ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ గెలవడం ప్రజాస్వామ్యానికి అవశ్యమని, ఆయనకు ప్రజాస్వామ్య విలువలు, వ్యవస్థలపై పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో బీజేపీతోనే టీడీపీ కలిసి ఉంటుందని, 2029 ఎన్నికల తర్వాత కూడా కేంద్రంలోను, రాష్ట్రంలోను టీడీపీ సుదీర్ఘకాలంపాటు కలిసి పయనిస్తుందని స్పష్టం చేశారు. మంగళవారం ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశాలతో సోమవారం మంత్రి లోకేశ్ ఢిల్లీ వచ్చారు. టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు నివాసంలో టీడీపీకి చెందిన 16 మంది లోక్‌సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులతో దాదాపు 2 గంటలకు పైగా సమావేశమయ్యారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ, ఎన్డీయే అభ్యర్థివిజయానికి టీడీపీ తరఫున తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీలతో చర్చించారు. సీపీ రాధాకృష్ణన్‌తో సీఎం చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదరడంలో ఆయన పాత్ర విస్మరించలేనిదని చెప్పినట్లు సమాచారం. కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు.
టీడీపీ ఎంపీలతో ప్రహ్లాద్ జోషి భేటీ
మధ్యాహ్నం టీడీపీ ఎంపీలతో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి భేటీ అయ్యారు. లావు శ్రీకృష్ణదేవరాయలు నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉప రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ విధానం గురించి నిపుణుల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అనంతరం మీడియాతో జోషి మాట్లాడుతూ... తమకు ఉభయ సభలలో ఉన్న మెజారిటీ కంటే అదనంగా 20-25 శాతం ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. తెలుగు వ్యక్తి అయిన ఇండీ కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఓటు వేయాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునివ్వడం అసందర్భమని అన్నారు.