Minister Lokesh: సహాయ చర్యలు వేగవంతం చేయండి
ABN , Publish Date - Oct 30 , 2025 | 06:20 AM
తుఫాన్ ప్రభావిత జిల్లాల అధికారులు మరో రెండ్రోజులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు.
మరో 2 రోజులు అప్రమత్తం: లోకేశ్
రోడ్లపై పేరుకున్న మట్టి, బురదను తొలగించాలి
ఇళ్లకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా
దెబ్బతిన్న చెరువులు, కాల్వగట్ల పటిష్ఠానికి చర్యలు
తుఫాన్ జిల్లాల కలెక్టర్లకు మంత్రి ఆదేశం
అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ ప్రభావిత జిల్లాల అధికారులు మరో రెండ్రోజులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. సహాయ చర్యలను వేగవంతం చేయాలన్నారు. బుధవారం సచివాలయం నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ సహకారంతో తగిన చర్యలు చేపట్టాలని, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య సముదాయాలకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడంతోపాటు పంట నష్టంపై ప్రాథమిక అంచనాలను వీలైనంత త్వరగా అంచనాలు రూపొందించాలని, దెబ్బతిన్న నిర్మాణాల వివరాలను నివేదించాలని కోరారు. వంతెనలు, కల్వర్టులను పర్యవేక్షించడంతోపాటు వర్షాల ధాటికి దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కాల్వ గట్లను పటిష్ఠపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని.. పాముకాటుకు ఉపయోగించే యాంటీ వీనం ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణతోపాటు సురక్షితమైన తాగునీరు అందించాలని.. బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో హోం మంత్రి అనిత, సీఎస్ విజయానంద్, ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటంనేని భాస్కర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
వరుసగా మూడో రోజూ ఆర్టీజీఎస్‌లోనే..
మొంథా తుఫాన్‌పై వరుసగా మూడో రోజు కూడా ఆర్టీజీఎస్ కేంద్రంలోనే ఉండి లోకేశ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. వివిధ జిల్లాల్లో తుఫాను అనంతర నష్టంపై ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రధానంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగిందని అధికారులు తెలిపారు. సరఫరా పునరుద్ధరణకు సత్వర చర్యలు తీసుకోవాలని లోకేశ్ ఆదేశించారు, మరోవైపు.. టీడీపీ శ్రేణులతోనూ ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు.