Minister Lokesh: బడిని బాగుచేద్దాం
ABN , Publish Date - Dec 06 , 2025 | 06:00 AM
ల్లిదండ్రులు, గురువుల రుణాన్ని ప్రతి ఒక్కరూ తీర్చుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ విద్యార్థులను కోరారు, అలాగే సామాజిక రుణం తీర్చుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ప్రభుత్వ స్కూళ్లంటే ఇంకా చిన్నచూపు
ఈ మైండ్‌సెట్ మారాలి: మంత్రి లోకేశ్
ప్రభుత్వ పాఠశాలలంటే కొంతమందికి ఇంకా చిన్నచూపే. ఆ మైండ్‌సెట్ మారాలి. టెక్నాలజీని జోడించి పిల్లలకు మెరుగైన విద్య అందిస్తాం.
- మంత్రి లోకేశ్
పార్వతీపురం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులు, గురువుల రుణాన్ని ప్రతి ఒక్కరూ తీర్చుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ విద్యార్థులను కోరారు., అలాగే సామాజిక రుణం తీర్చుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సమాజానికి ఎంతో కొంత ప్రతి ఒక్కరూ తిరిగివ్వాలని.. ఇందులో భాగంగానే బడిని బాగుచేసి సామాజిక రుణం తీర్చుకుందామని పిలుపిచ్చారు. భామిని ఏపీ మోడల్ స్కూల్ పీటీఎంలో ఆయన కూడా మాట్లాడారు. మూడేళ్లలో రాష్ట్రంలో మోడల్ ఎడ్యుకేషన్ సాధించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని.. దానిని సాధిస్తామని హామీ ఇచ్చారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని, ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. విద్యా విలువలను పెంపొందించేందుకు చాగంటి కోటేశ్వరరావుతో ప్రవచనాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. పిల్లలకు అర్థమయ్యేలా బాలల రాజ్యాంగాన్ని రూపొందించామని, పిల్లలతో మాక్ అసెంబ్లీని నిర్వహించామని, దీంట్లో పిల్లలు అద్భుతంగా సమస్యలపై చర్చించారని అన్నారు. క్లిక్కర్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తున్నామని, పైలట్ ప్రాజెక్టు కింద భామిని మోడల్ స్కూల్‌లో ఈ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇంగ్లాండ్ వంటి దేశాల్లో విద్యావిధానాన్ని పరిశీలించేందుకు ఉపాధ్యాయులను పంపిస్తున్నామని తెలిపారు. లీప్ యాప్ అందుబాటులోకి తెచ్చామని, దీని గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాలని సూచించారు. విద్యావ్యవస్థను అన్ని విధాలుగా అభివృద్థి చేసి దేశంలోనే నంబర్ వన్‌గా నిలవాలనేది సీఎం అభిమతమని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనకు పాలనపరమైన అంశాల్లో ఎన్నో సలహాలిస్తున్నారని.. విద్యావిధానంలో తీసుకురావలసిన సమూల మార్పులపై తాము ఎప్పటికప్పుడు చర్చించుకుంటామని తెలిపారు.
కారా మాస్టారు కథలు సజీవం..
కాళీపట్నం రామారావు(కారా మాస్టారు) మన మధ్య లేకపోయినా ఆయన రాసిన కథలు ఇంకా సజీవంగా మనతోనే ఉన్నాయని లోకేశ్ చెప్పారు. ‘ఉత్త్తరాంధ్ర ముద్దుబిడ్డ కారా మాస్టారు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. దేశ భవిష్యత్ తరగతి గది నుంచే ప్రారంభమవుతుంది. దీనిని చంద్రబాబు బలంగా నమ్ముతారు. ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను ఇవ్వాలనేదే ఆయన కల. ఈ కల నెరవేరాలంటే విద్యావ్యవస్థకు పూర్వవైభవం తీసుకురావాలి’ అని పేర్కొన్నారు.
అప్పుడు రాలేదు.. ఇప్పుడొచ్చారు..
‘నేను చదువుకునేటప్పుడు పేరెంట్స్ మీటింగ్‌కు నాన్న ఎప్పుడూ రాలేదు. అలాంటిది మీ పీటీఎంకు వచ్చారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా మా దేవాన్ష్ పీటీఎంకు నేను వెళ్తాను. అన్ని పనులూ మానుకుని మరీ వెళ్తాను. ఎందుకంటే పిల్లలను పైకి తీసుకురావలిన బాధ్యత ప్రభుత్వంపైనే కాదు.. తల్లిదండ్రులపై కూడా ఉంది. ఈ రోజు ఇక్కడ పిల్లలతో మాట్లాడాను. వారు ఎంతో ఆత్మస్థైర్యంతో మాట్లాడారు’ అని లోకేశ్ తెలిపారు.
ప్రకాశం పంతులు కథ..
‘చదువు విలువ గురించి తెలిసిన ఉదాహరణ చెబుతాను. ఒక పిల్లవాడు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు. తల్లి పైసా పైసా జమచేసి అతడిని చదివించింది. ఒకసారి మూడు రూపాయలు ఫీజు కట్టాల్సి రాగా, తన పట్టు చీరను ఆమె తాకట్టు పెట్టింది. అది చూసి ఆ పిల్లవాడిలో బాగా చదవాలన్న కసి పెరిగింది. ఆ చీర అమ్మకు తిరిగి ఇచ్చేయాలని అనుకున్నాడు. బారిస్టర్ అయ్యారు. ఓ పేపర్‌కు ఎడిటర్ అయ్యాడు. స్వాతంత్య్రం కోసం కూడా పోరాడారు. ఆ వ్యక్తే టంగుటూరి ప్రకాశం పంతులు’ అని లోకేశ్ గుర్తుచేశారు. వేదికపై సీఎం, లోకేశ్‌తోపాటు విద్యార్థిని నిహారిక, ఆమె తల్లి అరుణజ్యోతి, విద్యార్థి వి.మురళీసాయి, తండ్రి శ్రీనివాసరావు కూర్చున్నారు.