Share News

Minister Lokesh: స్టూడెంట్‌ కిట్లలో వెయ్యి కోట్లు ఆదా చేస్తాం

ABN , Publish Date - Sep 25 , 2025 | 06:43 AM

విద్యార్థులకు ఇస్తున్న స్టూడెంట్‌ కిట్లలో ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ వెల్లడించారు.

Minister Lokesh: స్టూడెంట్‌ కిట్లలో వెయ్యి కోట్లు ఆదా చేస్తాం

  • గత ప్రభుత్వంలో నాసిరకం యూనిఫాంలు

  • 2019-24 మధ్య కొనుగోళ్లపై విజిలెన్స్‌ విచారణ

  • చేనేతపై వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేస్తాం: లోకేశ్‌

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు ఇస్తున్న స్టూడెంట్‌ కిట్లలో ఐదేళ్లలో రూ.వెయ్యి కోట్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. గత ప్రభుత్వంలో భారీ ధరలతో యూనిఫాంలు, కిట్లు కొనుగోలు చేసినా, నాణ్యత లేనివి పంపిణీ చేశారని చెప్పారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్‌ ప్రశ్నకు మంత్రి సమాఽధానమిస్తూ... వైసీపీ హయాంలో ఒక్కో విద్యార్థికి యూనిఫాంకు రూ.1,061 వెచ్చించినా నాసిరకమే ఇచ్చారన్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్‌ విచారణకు ఆదేశించామన్నారు.


బుచ్చయ్య నేతృత్వంలో వర్కింగ్‌ గ్రూప్‌

చేనేతల సమస్యల పరిష్కారం, అభివృద్ధికి గోరంట్ల బుచ్చయ్య నేతృత్వంలో ఎమ్మెల్యేలతో వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేస్తామని లోకేశ్‌ ప్రకటించారు. ఎమ్మెల్యేలందరూ మంగళగిరి వెళ్లి చేనేత వస్ర్తాలను పరిశీలించాలని సూచించారు. తాను ప్రధాని వద్దకు వెళితే మంగళగిరి చేనేత శాలువాలే తీసుకెళ్తున్నానని చెప్పారు. చేనేతను ప్రోత్సహించేందుకు విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం తయారీని 20శాతం చేనేతలకు ఇవ్వాలన్నారు. కాగా, గురువారం నిర్వహిస్తున్న మెగా డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ సభకు ఎమ్మెల్యేలంతా హాజరుకావాలని లోకేశ్‌ అసెంబ్లీ వేదికగా ఆహ్వానించారు. అందరికీ ఆహ్వాన పత్రాలు పంపామన్నారు. చిత్తూరులో త్వరలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... జిల్లాకు కనీసం ఒక యూనివర్సిటీ ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు.


బాలికా సంరక్షణ పథకం విభజన జరగాలి: సంధ్యారాణి

ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన నూతన బాలికా సంరక్షణ పథకం విభజన ఇంకా జరగలేదని, అందువల్లే బాండ్లు మెచ్యూర్‌ అయినా లబ్ధిదారులకు నగదు అందడం లేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 4.39లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ఇప్పటికే అధికారుల స్థాయిలో రెండు రాష్ర్టాల మధ్య సమావేశాలు జరిగాయని, అవసరమైతే మంత్రుల స్థాయి సమావేశం ఏర్పాటుచేసి విభజన ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. త్వరలో గిరిజనులకు ట్రైకార్‌ రుణాలు అందిచనున్నట్లు సంధ్యారాణి తెలిపారు.

Updated Date - Sep 25 , 2025 | 06:44 AM