Share News

Minister Lokesh: దివ్యాంగ విద్యార్థికి లోకేశ్‌ అండ

ABN , Publish Date - Aug 15 , 2025 | 06:04 AM

నీట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించినా.. ఇంటర్‌లో తప్పనిసరిగా ఇంగ్లిష్‌ సబ్జెక్టు చదివి ఉండాలనే నిబంధన కారణంగా మెడికల్‌ సీటు కోల్పోనున్న దివ్యాంగ విద్యార్థికి విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ అండగా నిలిచారు. తిరుపతికి చెందిన ...

Minister Lokesh: దివ్యాంగ విద్యార్థికి లోకేశ్‌ అండ

  • ప్రత్యేక జీవో ద్వారా ఇంటర్‌ సవరణ మార్కుల మెమో

  • ‘నీట్‌’ ర్యాంకర్‌కు తొలగిన మెడికల్‌ సీటు అడ్డంకి

  • మంత్రికి ధన్యవాదాలు తెలిపిన విద్యార్థి తల్లిదండ్రులు

తిరుపతి, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): నీట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించినా.. ఇంటర్‌లో తప్పనిసరిగా ఇంగ్లిష్‌ సబ్జెక్టు చదివి ఉండాలనే నిబంధన కారణంగా మెడికల్‌ సీటు కోల్పోనున్న దివ్యాంగ విద్యార్థికి విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ అండగా నిలిచారు. తిరుపతికి చెందిన ఆ విద్యార్థి తల్లిదండ్రుల విజ్ఞప్తిపై తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించారు. గతంలో పాతిక మంది దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్‌లో ఇంగ్లిష్‌ సబ్జెక్టులో కనీస మార్కులు 35 కలుపుతూ జారీ చేసిన ప్రత్యేక జీవో ద్వారానే.. తాజాగా బైపీసీ విద్యార్థి హరిహర బ్రహ్మారెడ్డి విషయంలోనూ చర్యలు తీసుకున్నారు. మంత్రి కార్యాలయం నుంచి అందిన సమాచారంతో విద్యార్థి తల్లిదండ్రులు గురువారం హుటాహుటిన ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయానికి చేరుకోగా.. అక్కడ వారికి కనీస మార్కులు కలిపిన కొత్త మార్కుల మెమో అందజేశారు. మెమోను ఈనెల 20 లోపు కౌన్సిలింగ్‌ కోసం అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. రెండో విడతలో తన కుమారుడికి ఏపీలోనే ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీటు దక్కే అవకాశముందని తండ్రి ప్రతా్‌పరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇంగ్లిష్‌ ‘మినహాయింపు’ ఆప్షన్‌తో..

దాసరెడ్డి హరిహర బ్రహ్మారెడ్డి ఇంటర్‌ బైపీసీ ఇంగ్లిష్‌ మీడియంలో చదివాడు. దివ్యాంగ విద్యార్థులకు ఇంటర్‌లో ఫస్ట్‌ లేదా సెకండ్‌ లాంగ్వేజీ కింద ఇంగ్లి్‌షను ఎంచుకోకుండా మినహాయింపు ఉంది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్షలో దివ్యాంగ కేటగిరీలో 1,174వ ర్యాంకు సాధించిన బ్రహ్మారెడ్డికి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో సీటు లభించే అవకాశముంది. తొలి రౌండ్‌లోనే అతనికి తెలంగాణలోని నల్గొండ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీటు ఖరారైంది. అయితే నీట్‌ నిబంధనల ప్రకారం ఇంటర్‌లో ఫస్ట్‌ లేదా సెకండ్‌ లాంగ్వేజీ కింద ఇంగ్లిష్‌ సబ్జెక్టు తప్పనిసరి. మార్కుల జాబితాలో ఫస్ట్‌ లాంగ్వేజీ కాలమ్‌లో మార్కులకు బదులు ఆంగ్ల అక్షరం ‘‘ఇ’’ అని వుండడంతో మెడికల్‌ సీటు కోల్పోతామని విద్యార్థి, తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మంత్రి లోకేశ్‌ను ఆశ్రయించారు.

Updated Date - Aug 15 , 2025 | 06:04 AM