Share News

Minister Lokesh: ఏఐ విప్లవానికి నాయకత్వం వహిద్దాం

ABN , Publish Date - Nov 16 , 2025 | 05:01 AM

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ విప్లవం మనల్ని నడిపించకూడదని, మనమే ఏఐ విప్లవానికి నాయకత్వం వహిద్దామని మంత్రి లోకేశ్‌ పిలుపునిచ్చారు.

Minister Lokesh: ఏఐ విప్లవానికి నాయకత్వం వహిద్దాం

  • ఉద్యోగాల కోతపై భయాలు అవసరం లేదు

  • ‘క్వాంటమ్‌’లో భారత్‌ నంబర్‌ వన్‌గా నిలుస్తుంది

  • 2029 కల్లా ఇన్నోవేషన్‌ ఆధారిత రాష్ట్రంగా మారుస్తాం: లోకేశ్‌

విశాఖపట్నం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ విప్లవం మనల్ని నడిపించకూడదని, మనమే ఏఐ విప్లవానికి నాయకత్వం వహిద్దామని మంత్రి లోకేశ్‌ పిలుపునిచ్చారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా రెండోరోజైన శనివారం ‘ఏఐ, ఉద్యోగాలు భవిష్యత్తు- అంతరాలను, అవకాశాలను మార్చడం’ అనే అంశంపై నిర్వహించిన సెషన్‌లో మంత్రి కీలకోపన్యాసం చేశారు. ఏఐ విప్లవంలో భాగస్వాములయ్యేందుకు మూడు విధాలుగా సన్నద్ధమవుదామని పిలుపునిచ్చారు. రీ-స్కిల్లింగ్‌, రీ-డిఫైనింగ్‌, రీ-ఇమేజనింగ్‌ అని మూడు ‘ఆర్‌’ ఫార్ములాను ఆయన ప్రతిపాదించారు. రీ-స్కిల్లింగ్‌లో భాగంగా ఏఐ సాంకేతికతలో ప్రస్తుతం అన్నిరంగాల్లో ఉన్న నిపుణుల నైపుణ్యాలను మెరుగుపరచాలని అన్నారు. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం నైపుణ్యం అనే ప్లాట్‌ఫాంను తయారుచేసిందని చెప్పారు. రీ-డిఫైనింగ్‌లో భాగంగా ఏఐ, మానవ మేధస్సు సహకారంతో ఉత్పత్తి రంగంలో మార్పులు తీసుకురావాలన్నారు. రీ-ఇమేజింగ్‌లో అసమానతలను సంప్రదాయ కోణంలో కాకుండా ఏఐ కోణంలో చూడాలని తెలిపారు. మనుషుల్లో అసమానతలకు ఏఐ కారణం కాకూడదని, వాటిని తొలగించే వారధి కావాలని ఆకాంక్షించారు. ఏఐ కారణంగా రానున్న రోజుల్లో ఉద్యోగాల కోత వంటి భయాలు అవసరం లేదని, దీనివల్ల ఉత్పన్నమవుతున్న ప్రశ్నలు, భయాలకు వచ్చే ఐదేళ్లలో ఏపీ ఒక సమాధానంగా నిలుస్తుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ‘ఏఐ ఈజ్‌ రెడీ ఫర్‌ ఏజెంటిక్‌ ఏఐ’ అనే నివేదికను ఆవిష్కరించారు. అనంతరం రానున్న ఐదేళ్లలో 30వేల మంది యువతకు నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌, సీఐఐ భాగస్వామ్యంతో విజయవాడలో మోడల్‌ కెరీర్‌ సెంటర్‌ ఏర్పాటుపై ఏంవోయూ చేసుకున్నారు.


‘క్వాంటం పాలసీ- 2025’ విడుదల

క్వాంటం రంగంలో ప్రపంచంలోనే భారత్‌ టాప్‌లో నిలుస్తుందని, ఈ రంగంలో మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్రం సంసిద్ధంగా ఉందని లోకేశ్‌ అన్నారు. ‘ఆత్మనిర్భర్‌ క్వాంటం- ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ క్వాంటం స్టాక్‌ నిర్మాణం’ అనే అంశంపై నిర్వహించిన చర్చలో మంత్రి మాట్లాడారు. క్వాంటం కంప్యూటర్‌, సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌, టాలెంట్‌, నమ్మకం అనే నాలుగు పిల్లర్లపై అమరావతి క్వాంటం వ్యాలీ ఆధారపడి ఉందని చెప్పారు. ఈ సందర్భంగా క్వాంటం పాలసీ- 2025ను ఆవిష్కరించారు. ఏటా 15 వేల మంది విద్యార్థులకు క్వాంటం కంప్యూటింగ్‌లో శిక్షణ ఇస్తామని సీఎం కార్యదర్శి పీఎస్‌ ప్రద్యుమ్న తెలిపారు. అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం పాలసీ గురించి ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ వివరించారు. అనంతరం లోకేశ్‌ సమక్షంలో 25 సంస్థలతో ప్రభుత్వం క్వాంటం కంప్యూటింగ్‌కు సంబంధించి ఒప్పందాలు చేసుకుంది.


దేశానికి టెక్‌ రాజధానిగా ఏపీ

‘రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌టీఐహెచ్‌)-వన్‌ ఫ్యామిలీ-వన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌-ఇన్నోవేషన్‌-ఇన్‌క్లూజన్‌ అండ్‌ ఇంపాక్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’ పేరుతో నిర్వహించిన సదస్సులో లోకేశ్‌ పాల్గొన్నారు. దేశానికి టెక్‌ రాజధానిగా ఏపీకి అభివృద్ధి చేస్తామని చెప్పారు. 2029 నాటికి ఏపీని ఇన్నోవేషన్‌ ఆధారిత రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు. ఈ రంగంలో 20 వేలకు పైగా స్టార్ట్‌పలు, లక్ష ఉద్యోగాలు, 10 ప్రధాన రంగాల్లో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త... కేవలం నినాదం కాదని, అభివృద్ధికి కొత్త నమూనా అన్నారు. దీని కోసమే ఏపీ ఇన్నోవేషన్‌ సార్ట్టప్‌ పాలసీ-2024ను ప్రవేశపెట్టామని లోకేశ్‌ పేర్కొన్నారు. కాగా, మంత్రి సమక్షంలో పలు సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఏపీ వాగ, స్టార్టప్‌ యూఏఈ, క్వాంటం ఏఐ, స్టార్టప్‌ రన్‌వే, ఆర్‌ఆర్‌పీ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు.


ఏపీలో సైబర్‌ రెజిలియన్స్‌ కేంద్రం

డబ్ల్యుఈఎఫ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం.. ఇంధన రంగానికి రక్షణ: సీఎం చంద్రబాబు

ఏపీ అభివృద్ధిలో భాగస్వాములవ్వండి.. పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్‌ పిలుపు

విశాఖపట్నం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఇంధన భద్రత కోసం మెరుగైన రక్షణ విధానాన్ని ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా రెండో రోజైన శనివారం ఇంధన భద్రత, విద్యుత్తు రంగంలో అధునాతన టెక్నాలజీ వినియోగం కోసం సెంటర్‌ ఫర్‌ ఎనర్జీ సైబర్‌ రెజిలియన్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యుఈఎ్‌ఫ)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇంధన రంగంలో అవసరమైన సైబర్‌ రక్షణ వ్యవస్థలను కూడా తయారు చేసుకోవాలని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు డబ్ల్యుఈఎఫ్‌ ముందుకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. సైబర్‌ రెజిలియన్స్‌ కేంద్రం విద్యుత్తు వ్యవస్థల రక్షణకు పనిచేస్తుందని తెలిపారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ మాట్లాడుతూ ఏపీలో 160 గిగావాట్ల గ్రీన్‌ విద్యుత్‌ ఉత్పత్తి దిశగా భారీ పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు.

Updated Date - Nov 16 , 2025 | 05:03 AM