Minister Lokesh: ఇకపై నమో అంటే నాయుడు, మోదీ
ABN , Publish Date - Nov 13 , 2025 | 06:28 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై నమో అంటే... నాయుడు అండ్ మోదీ. ఇద్దరు సమర్థ నేతల నేతృత్వంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై నమో అంటే... నాయుడు అండ్ మోదీ. ఇద్దరు సమర్థ నేతల నేతృత్వంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు అభివృద్ధి దిశగా పరుగులు తీస్తోంది’’ అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో నిర్వహించిన యూఎ్‌స-ఇండియా స్ర్టాటజిక్ పార్టనర్ షిప్ సమ్మిట్‌లో మంత్రి లోకేశ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘‘నేను 180 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిని. ఏపీలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టబోతోంది. ఇది దేశ చరిత్రలో సింగిల్ లార్జెస్ట్ ఎఫ్‌డీఐ. ఆర్సెలార్ మిట్టల్ సంస్థ భారత్‌లో అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను విశాఖపట్నం సమీపంలో నిర్మిస్తోంది. యూనివర్సిటీ స్థాయిలో ఏఐ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నాం. హైదరాబాద్ ఐఎస్‌బీ నమూనాలో ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. సీఎం చంద్రబాబుకు కొత్త నగరాలు నిర్మించిన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు అమరావతి మాదిరిగానే గతంలో సైబరాబాద్ నిర్మించారు. గుంటూరు- విజయవాడల నడుమ సుందరమైన అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో రైతులను కూడా భాగస్వాములుగా చేశాం. భారత్‌లో కొత్తనగరాల నిర్మాణానికి మేం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ విధానం దిక్సూచిగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ను కాలిఫోర్నియా ఆఫ్ ఈస్ట్‌గా పిలవచ్చు. దేశంలో హెచ్‌ఆర్‌డీ, ఐటీ శాఖలను కలసి నిర్వహించిన మంత్రిని నేను మాత్రమే’’ అని లోకేశ్ చెప్పారు.