Share News

Minister Lokesh: ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తాం

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:16 AM

సింగపూర్‌ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి లోకేశ్‌ పారిశ్రామిక దిగ్గజ సంస్థల ప్రతినిధులను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వారిని ఆహ్వానించారు.

Minister Lokesh: ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తాం

  • రాష్ట్రంలో ఎంఆర్‌ఓ హబ్‌కు సహకరించండి.. ఎయిర్‌బ్‌సకు మంత్రి లోకేశ్‌ ఆహ్వానం

  • ఆసియా-పసిఫిక్‌ ప్రెసిడెంట్‌ ఆనంద్‌ స్టాన్లీతో భేటీ.. ఎవర్‌ వోల్ట్‌ చైర్మన్‌ సైమన్‌ టాన్‌తోనూ సమావేశం

  • ఏపీలో బ్యాటరీ సెల్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి.. రెన్యూవబుల్‌ ఎనర్జీలో నైపుణ్య శిక్షణకు టాన్‌ ఓకే

  • బలమైన విద్యా వ్యవస్థకు సింగపూర్‌ సహకారం కావాలి.. విద్యావేత్తలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో లోకేశ్‌

  • అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డయాస్పోరా వలంటీర్లకు మంత్రి పిలుపు

అమరావతి, జూలై 28(ఆంధ్రజ్యోతి): సింగపూర్‌ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి లోకేశ్‌ పారిశ్రామిక దిగ్గజ సంస్థల ప్రతినిధులను కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వారిని ఆహ్వానించారు. సోమవారం ఆయన ఎయిర్‌బస్‌ ఆసియా-పసిఫిక్‌ ప్రెసిడెంట్‌ ఆనంద్‌ స్టాన్లీ, ఎవర్‌వోల్ట్‌ చైర్మన్‌ సైమన్‌ టాన్‌లతో భేటీ అయ్యారు. విమానయాన రంగంలో మెయింటినెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌ఓ) హబ్‌గా ఏపీ అభివృద్ధి చెందడానికి సహకరించాలని ఆనంద్‌ స్టాన్లీని కోరారు. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌, ఆగ్నేయాసియా మార్కెట్ల నుంచి విమాన సేవల డిమాండ్‌ పెరుగుతోందని, ఇది ఎంఆర్‌ఓ సేవలకు పెద్ద క్యాప్టివ్‌ మార్కెట్‌ను సృష్టించనుందని అభిప్రాయపడ్డారు. భారత్‌లో 850 కంటే ఎక్కువ ఎయిర్‌బస్‌ విమానాలు ఎగురుతున్నాయని వివరించారు. దక్షిణాసియాలో ఎయిర్‌బ్‌సకు డెడికేటెట్‌ ఎమ్‌ఆర్‌ఓ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ మారే అవకాశం ఉందన్నారు. విమానయాన భాగస్వాములకు సమర్థవంతమైన సర్వీసింగ్‌ సేవల కోసం ఏపీతో కలసి పనిచేయాల్సిందిగా కోరారు. సమగ్ర పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి, సింగపూర్‌ ప్రమాణాలకు అనుగుణంగా ప్రపంచస్థాయి సౌకర్యాలను కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని సౌకర్యాలను చూసేందుకు ఒకసారి ఏపీకి రావాలని ఆనంద్‌ స్టాన్లీని ఆహ్వానించారు.

Untitled-2 copy.jpg


సోలార్‌ సెల్‌ యూనిట్‌ స్థాపించండి

రాష్ట్రంలో పెద్దఎత్తున సోలార్‌సెల్‌ మాడ్యూల్‌, బ్యాటరీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఎవర్‌వోల్ట్‌ గ్రీన్‌ ఎనర్జీ చైర్మన్‌ సైమన్‌ టాన్‌ను లోకేశ్‌ కోరారు. రెన్యూ, సుజలాన్‌ వంటి భారీ కంపెనీలు ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించాయని చెప్పారు. అత్యాధునిక సాంకేతికతో కూడిన సౌరశక్తి నిల్వ ఆవిష్కరణ కోసం ఎవర్‌ వోల్ట్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని ఐటీఐలలో రెన్యూవబుల్‌ ఎనర్జీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ట్రైనింగ్‌కు సహకారం అందించాలని కోరారు. ఎంపిక చేసిన ఓ ఐటీఐలో దీనిపై ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ ఇస్తామని సైమన్‌ టాన్‌ హామీ ఇచ్చారు. తమ సంస్థ ఉన్నత స్థాయి బృందంతో మాట్లాడి ఏపీలో యూనిట్‌ ఏర్పాటు చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని టాన్‌ వెల్లడించారు.

మోదీ వచ్చినపుడు కృతజ్ఞతలు తెలపండి

గత ఐదేళ్ల విధ్వంస పాలన చూశాక రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లోని తెలుగు వారంతా ముందుకు రావాలని లోకేశ్‌ పిలుపునిచ్చారు. తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వలంటీర్లు సోమవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ త్వరలోనే సింగపూర్‌లో పర్యటిస్తారని... తెలుగువారంతా పెద్దఎత్తున పాల్గొని రాష్ట్రానికి సహకరిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలపాలని విజ్ఞప్తి చేశారు.


భవిష్యత్‌కు అనుగుణంగా కోర్సులు

రాష్ట్రంలో యువతను ఉద్యోగాల కోసమేగాకుండా.. భవిష్యత్‌కు అవసరమైన నైపుణ్యాలతో సిద్ధం చేస్తున్నామని లోకేశ్‌ చెప్పారు. అంతర్జాతీయంగా వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలోని వర్సిటీల్లో నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రవేశ పెడుతున్నామన్నారు. బలమైన విద్యా పర్యావరణ వ్యవస్థకు సింగపూర్‌ సహకరించాలని కోరారు. సింగపూర్‌ విద్యావేత్తలతో ‘నైపుణ్యాల నుంచి సామర్థ్యాలకు శ్రామికశక్తి పరివర్తనను వేగవంతం చేయడం’ అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాభివృద్ధికి సంప్రదాయ విద్యావిధానం సరిపోదన్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం సాంకేతిక నైపుణ్యాలనే కాకుండా సామర్థ్యాలను కూడా కోరుకుంటోందని చెప్పారు. సంక్లిష్ట సమస్యలను స్వీకరించే, ఆవిష్కరించే, పరిష్కరించే సామర్థ్యం కూడా శ్రామికశక్తి కలిగి ఉండాలని పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలకు ఏపీ కేంద్ర బిందువు అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వేగవంతమైన మార్పు కోసం సింగపూర్‌తో కలసి పనిచేస్తామని పేర్కొన్నారు. రీసెర్చ్‌, ఇన్నోవేషన్‌, స్టూడెంట్‌ ఎక్స్చేంజ్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షి్‌పలపై సింగపూర్‌ వర్సిటీలతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని లోకేశ్‌ ప్రకటించారు.

Untitled-3 copy.jpg

Updated Date - Jul 29 , 2025 | 04:47 AM