Minister Lokesh: వెల్‌కం.. ఎయిర్ బస్
ABN , Publish Date - Oct 01 , 2025 | 04:21 AM
ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మంగళవారం ఢిల్లీలో ఆ దిగ్గజ సంస్థ పూర్తిస్థాయి బోర్డు..
పెట్టుబడులతో ఏపీకి రండి
దిగ్గజ సంస్థకు మంత్రి లోకేశ్ ఆహ్వానం
ప్రపంచ స్థాయి తయారీ కేంద్రం పెట్టండి
పూర్తిగా సహకరిస్తాం.. ప్రధాన యూనిట్‌తో
పాటు ఇంటిగ్రేటెడ్ క్లస్టర్‌నూ ఏర్పాటు చేయండి
ఎయిర్ బస్ బోర్డు ముందు మంత్రి ప్రతిపాదన
ఢిల్లీలో ఆ సంస్థ చైర్మన్, ఎండీలతో భేటీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ ‘ఎయిర్ బస్’ పెట్టుబడుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మంగళవారం ఢిల్లీలో ఆ దిగ్గజ సంస్థ పూర్తిస్థాయి బోర్డు ఉన్నత స్థాయి సమావేశానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ హాజరయ్యారు. మొదటిసారి భారతదేశానికి వచ్చిన ఎయిర్ బస్ బోర్డుకు ఈ సందర్భంగా ఆయన స్వాగతం పలికారు. ఎయిర్‌బస్ చైర్మన్ రెనీ ఒబెర్మన్‌తో పాటు ఆ సంస్థ ఇండియా, సౌత్ ఏషియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌లతో కూడిన బోర్డుకు లోకేశ్ పలు ప్రతిపాదనలు చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఇస్తున్న ప్రాధాన్యాలు, పెట్టుబడుల విధానం, వేగవంతమైన అనుమతులు, సింగిల్ విండో సౌకర్యం, నిర్దిష్ఠ గడువులోగా ప్రాజెక్టు అమలు వంటి అంశాలు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్, ప్రపంచస్థాయి పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించిన ఆయన ట్రాక్ రికార్డు గురించి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ బస్ నేతృత్వంలో ప్రపంచస్థాయి ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. దీనికి అనుబంధంగా సప్లయ్ చైన్‌లో ఎండ్ టు ఎండ్ అనుసంధానానికి టైర్ 1, టైర్ 2 ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టామన్నారు. ఏపీలో ఇప్పటికే పరిశ్రమలకు అందుబాటులో భూమి ఉందని వివరించారు. ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి, గ్లోబల్ క్వాలిటీ మాన్యుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కు అనుకూలంగా ఉన్న రాష్ట్ర ఏరోస్పేస్ పాలసీని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను వివరించారు.
ఇంటిగ్రేటెడ్ క్లస్టర్‌నూ ఏర్పాటు చేయండి..
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన యూనిట్‌తోపాటు సరఫరాదారులు, ఎంఎస్ఎంఈలు, భాగస్వాములు కలిసి పనిచేయగల ఇంటిగ్రేటెడ్ క్లస్టర్‌ను సైతం ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు.ప్రపంచ ఏరోస్పేస్ రంగంలో స్వర్ణ ప్రమాణానికి సూచికగా నిలిచే ఎయిర్‌బస్‌కు అవసరమైన పూర్తి ఎకో సిస్టమ్ అందించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.సమావేశంలో పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు కూడా పాల్గొన్నారు. మొదటిసారిగా ఎయిర్‌బస్ బోర్డు భారత్‌కి వచ్చిన నేపథ్యంలో ఆ సంస్థతో దేశ ప్రత్యేక సంబంధాలను మరింతగా బలోపేతం చేసే దిశగా చర్చలు సాగాయని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.