Minister Lokesh: తరలిరండి
ABN , Publish Date - Oct 07 , 2025 | 03:43 AM
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో టాటా గ్రూప్ భాగం కావాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్ పిలుపిచ్చారు. అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములవ్వండి
టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్‌కు లోకేశ్ ఆహ్వానం
అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టండి
ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ ఇన్‌ఫ్రా అభివృద్ధిలో పాలుపంచుకోండి
రూఫ్‌టాప్ సోలార్ అభివృద్ధిలో కూడా
విశాఖలో టాటాఎలెక్సీ సెంటర్ పెట్టండి
శ్రీసిటీలో ఎలక్ట్రానిక్ వాహన విడిభాగాల యూనిట్ల స్థాపనను పరిశీలించండి
భూమి, వసతులు కల్పిస్తాం.. లోకేశ్ హామీ
పలువురు ఇతర పారిశ్రామికవేత్తలతోనూ వరుస భేటీలు.. పెట్టుబడులకు ఆహ్వానం
అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో టాటా గ్రూప్ భాగం కావాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేశ్ పిలుపిచ్చారు. అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సోమవారం ముంబైలో ఆయన టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యారు. టాటా పవర్ రెన్యూవబుల్స్ సీఈవో సంజయ్‌కుమార్ బంగా, ఇండియా హోటల్స్ ఎండీ పునీత్ చత్వాల్, టాటా ఆటో కాంప్ సీఈవో మనోజ్ కొహ్లాత్కర్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సీఈవో సుకరన్ సింగ్, టాటా ఎలక్ట్రానిక్స్ ఎండీ రణధీర్ ఠాకూర్, టాటా కెమికల్స్ ఎండీ ఆర్.ముకుందన్, టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సీఈవో వినాయక్ పాయ్, టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ సీఈవో బిమల్ ఖండేల్వాల్ తదితరులు కూడా పాల్గొన్నారు. విశాఖపట్నంలో ఈ నెలలో రాష్ట్ర అగ్ర నేతల సమక్షంలో నిర్వహించే టీసీఎస్ డెవల్‌పమెంట్ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని చంద్రశేఖరన్‌ను లోకేశ్ ఆహ్వానించారు.టాటా పవర్ రెన్యూవబుల్స్ ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ ఇన్‌ఫ్రా అభివృద్ధిలో.. రాష్ట్ర ప్రజలకు సౌకర్యంగా ఉండేలా రూఫ్‌టాప్ సోలార్ అభివృద్ధి చేసే ప్రక్రియలో కూడా ప్రభుత్వంతో భాగస్వామి కావాలని కోరారు. ‘రాష్ట్రంలో సెల్ మాడ్యూల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ స్థాపనకు అవకాశాలను పరిశీలించండి.
విశాఖలో టాటాఎలెక్సీ ప్రాంతీయ కార్యాలయం, ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి. సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ వెహికల్స్ అటానమస్ సిస్టమ్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ టెక్నాలజీస్ ఆధారిత మొబిలిటీ/ఇన్నోవేషన్ వంటి రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయండి. శ్రీసిటీలో ఎలక్ట్రానిక్ వాహన విడిభాగాలు, యూనిట్ల స్థాపనను పరిశీలించండి. ఇందుకు అవసరమైన భూమి ఇతర సదుపాయాలు కల్పిస్తాం. మచిలీపట్నం లేదా మూలపేట పోర్టులకు సమీపంలో సోడా యాష్ ఉత్పత్తి యూనిట్‌ను స్థాపించండి. విశాఖలో డేటా సిటీ ప్రాంతంలో ఏ-1 రెడీ డేటా సెంటర్ క్యాంపస్ స్థాపనకు గల అవకాశాలను పరిశీలించండి’ అని లోకేశ్ అభ్యర్థించారు.
పారిశ్రామికవేత్తలతో లోకేశ్ వరుస సమావేశాలు
వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం
పోర్టు ఆధారిత వసతుల కల్పనపై దృష్టి
ముంబైలో ట్రాఫిగురా, ఈఎస్ఆర్,రుస్తోంజీ, హెచ్‌పీ, బ్లూస్టార్, రహేజా అధినేతలతో వేర్వేరు భేటీలు
అమరావతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మంత్రి లోకేశ్ సోమవారం ముంబైలో వివిధ పారిశ్రామికవేత్తలతో విడివిడిగా భేటీ అయ్యారు. ప్రధానంగా పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలని ట్రాఫిగురా సీఈవో సచిన్ గుప్తాను కోరారు. లాజిస్టిక్స్, చమురు, ఖనిజాలు, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఈ సంస్థ ముందంజలో ఉంది. విశాఖ పోర్టు నుంచి బొగ్గు, జింక్, అల్యూమినియం వంటి వస్తువులను ఎగుమతి చేస్తోంది. రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజీ, ఎగుమతి మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని గుప్తాకు లోకేశ్ విజ్ఞప్తి చేశారు. విశాఖ, కాకినాడ రేవుల్లో సరుకు నిల్వలకు అధునాతన వేర్ హౌసింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. పునరుత్పాదక ఇంధన రంగంలో దూసుకుపోతున్న ఏపీతో కలిసి విద్యుత్ వాణిజ్యంలో భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. కాకినాడ లేదా విశాఖలో ఎల్‌ఎన్‌జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్‌ను ఏర్పాటు చేసి గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తికి సహకరించాలని కోరారు. విశాఖ పోర్టు నుంచి ఈ ఏడాది 82.62 మిలియన్ టన్నుల సరుకు రవాణా నమోదైన నేపథ్యంలో విశాఖలో కమోడిటీ ట్రేడింగ్ డెస్క్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని అభ్యర్థించారు.

పారిశ్రామిక పార్కుల అభివృద్ధిలో భాగస్వామ్యం వహించండి
గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫాం ఈఎస్ఆర్ గ్రూప్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్ హెడ్ సాదత్ షా, డైరెక్టర్ ప్రకృత్ మెహతాతో లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ 4.0.. పెట్టుబడులకు అనుకూలంగా ఉందని చెప్పారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి మార్గాల్లో 1000 ఎకరాలకు పైగా మెగా పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని.. ఇందులో ఏపీఐఐసీతో భాగస్వామి కావాలని కోరారు. పోర్టుల సమీపంలో 1.5 పెద్ద లాజిస్టిక్స్ పార్కులనూ అభివృద్ధి చేయబోతున్నట్లు వెల్లడించారు. విశాఖ, కాకినాడ పోర్టుల వద్ద మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేయాలని ఈఎస్ఆర్ సంస్థను ఆహ్వానించారు.
వచ్చే నెలలో ఆర్సెలర్ స్టీల్ ప్లాంటు పనులు
వచ్చేనెల 14-15 తేదీల్లో విశాఖలో జరగనున్న రెండు రోజుల పారిశ్రామిక భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా సోమవారం ముంబైలో ఆయన బిజినెస్ రోడ్‌షో చేపట్టారు. వచ్చేనెలలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంటు పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ నెల 14న గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరుగుతుందని చెప్పారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు త్వరలోనే తమ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు.
త్రీడీ ప్రింటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ స్థాపించండి
రాష్ట్రంలో త్రీడీ ప్రింటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయాలని హెచ్‌పీ ఇండియా మార్కెట్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్-ఎండీ ఇప్సితా దాస్ గుప్తాను లోకేశ్ కోరారు. 2019లోనే ఈ సంస్థ రాష్ట్రంలో ప్రభుత్వ భాగస్వామ్యంతో త్రీడీ ప్రింటింగ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినా.. ఆ ప్రతిపాదనలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక పారిశ్రామిక పెట్టబడుల విధానంలో సమూల మార్పులు వచ్చాయని.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని హెచ్‌పీ గతంలో చేసిన ఆలోచనలను ఇప్పుడు అమలు చేయాలని లోకేశ్ విజ్ఞప్తిచేశారు.
విశాఖలో లగ్జరీ టౌన్‌షిప్ ఏర్పాటు చేయండి
విశాఖలో లగ్జరీ టౌన్‌షి్‌పను ఏర్పాటు చేయాలని రుస్తోంజీ చైర్మన్ బోమన్ ఇరానీతో భేటీలో లోకేశ్ కోరారు. ఐటీ కంపెనీలు, డేటా సెంటర్ల రాకతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశా ఖ మహానగరంలో లగ్జరీ టౌన్‌షి్‌ప నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.