Minister Lokesh: 5 గంటలు.. 4 వేల విజ్ఞప్తులు
ABN , Publish Date - Nov 05 , 2025 | 04:57 AM
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేశ్ 70వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు వినతులు స్వీకరించారు..
లోకేశ్ 70వ రోజు ప్రజా దర్బార్
ప్రతి ఒక్కరి నుంచి వినతులు స్వీకరించిన మంత్రి
సొంత తల్లి, చెల్లిని తరిమేసిన జగన్‌కు దేశ భక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుంది?: లోకేశ్
అమరావతి, గుంటూరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేశ్ 70వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు వినతులు స్వీకరించా రు. అనంతరం పార్టీ కార్యకలాపాలపై పార్టీబ్యాక్ ఆఫీసు సిబ్బందితో చర్చించారు. తిరిగి రాత్రి 8 గంటలకు ఇంటికి వెళ్లే సమయంలో సుమారు 500 మంది పైచిలుకు ప్రజలు వేచి ఉండటం చూసి మరో గంటపాటు అర్జీలు స్వీకరించారు. సుమారు 10 గంటలపాటు పార్టీ కార్యాలయంలోనే గడిపారు. లోకేశ్‌ను కలసి సమస్యలు విన్నవించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలివచ్చారు. సుమారు 5 గంటలపాటు 4 వేల మందికిపైగా లోకేశ్‌ను కలసి వారి సమస్యలను విన్నవించుకున్నారు. ఏపీ జెన్‌క్కో, ట్రాన్స్‌కో, డిస్కిమ్‌లలో పనిచేస్తున్న సుమారు 23,500 మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్ర రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు లోకేశ్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. వేతన సవరణ చేయడంతోపాటు ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోని పారా మెడికల్ విభాగంలో ఖాళీగా ఉన్న హెల్త్ అసిస్టెంట్ మేల్ పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని అన్‌ఎంప్లాయిస్ పారా మెడికల్ హెల్త్ అసిస్టెంట్(మేల్) అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కోరారు. ఎక్కువ ఫిర్యాదులు భూ వివాదాలకు సంబంధించి వచ్చాయి.
అప్పుడప్పుడూ ఏపీకి వచ్చే మీరా మమ్మల్ని విమర్శించేది
‘అప్పుడప్పుడు ఏపీకి వచ్చే జగన్.. ఎప్పుడూ జనం మధ్య ఉండే మా వైపు ఒక వేలు ఎత్తి చూపుతున్నారు. ఆయన వైపు మిగిలిన నాలుగు వేళ్లు చూపుతున్నాయని మర్చిపోతున్నారు’ అని మంత్రి లోకేశ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘తుఫాన్ హెచ్చరిక వచ్చిన నాటి నుంచి సాధారణ పరిస్థితి నెలకొనే దాకా సీఎం నుంచి ఎమ్మెల్యే వరకు... చీఫ్ సెక్రటరీ నుంచి విలేజ్ సెక్రటరీ వరకు అంతా ప్రజలతోనే ఉన్నాం. ఇవన్నీ తెలియడానికి మీరు ఇక్కడ లేరు. మీది వేరే భ్రమాలోకం. అందులో విహరిస్తుంటే, ఇవన్నీ తెలియవు. నాకు మహిళలంటే గౌరవం, దేశమంటే భక్తి. అందుకే మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ముంబై వెళ్లాను. కోట్లాది భారతీయులు తలెత్తుకునేలా మహిళామణులు వరల్డ్ కప్ గెలిస్తే, నేనే గెలిచినంత ఆనందించాను. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుందిలే..!’ అని లోకేశ్ ఎద్దేవా చేశారు.