Share News

Minister Lokesh: దావోస్‌ తరహాలోనే..

ABN , Publish Date - Oct 26 , 2025 | 05:08 AM

దావోస్‌లో ఈ ఏడాది జనవరిలో జరిపిన పర్యటన తరహాలోనే రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖల మంత్రి లోకేశ్‌ ఆస్ట్రేలియా పర్యటన సాగింది.

Minister Lokesh: దావోస్‌ తరహాలోనే..

  • రాష్ట్రంలోని సానుకూలతలు చెప్పడానికే లోకేశ్‌ ప్రాధాన్యం

  • విశాఖ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా ఆస్ట్రేలియాలో పారిశ్రామికవేత్తలతో భేటీలు

  • పెట్టుబడుల వాతావరణం, చంద్రబాబు పాలనాదక్షత, విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడలపై ఫోకస్‌

  • వారం పర్యటన సంతృప్తినిచ్చిందని ట్వీట్‌

అమరావతి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): దావోస్‌లో ఈ ఏడాది జనవరిలో జరిపిన పర్యటన తరహాలోనే రాష్ట్ర విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖల మంత్రి లోకేశ్‌ ఆస్ట్రేలియా పర్యటన సాగింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనుకూల వాతావరణం.. సీఎం చంద్రబాబు పాలనానుభవంతో గత 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం.. విశాఖకు గూగుల్‌ డేటా సెంటర్‌ను తీసుకురావడానికి తాను పడిన కష్టాన్ని పారిశ్రామికవేత్తలకు వివరించారు. పెట్టుబడుల కోసం అక్కడ ఒప్పందాలకు తొందరపడకుండా వారందరినీ వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖ భాగస్వామ్య సదస్సుకు రప్పించడానికే ఆయన ప్రాధాన్యమిచ్చారు. వారి పెట్టుబడులకు పూర్తి భరోసా ఇచ్చారు. ఒకసారి ఏపీ ప్రభుత్వంతో చేతులు కలిపాక వారి ప్రాజెక్టుల బాధ్యత మొత్తం తమదేనని హామీ ఇచ్చారు. గడువు కంటే ముందే అనుమతులు వచ్చేలా చేస్తామని.. ఉత్పత్తి మొదలయ్యేదాకా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు పాలనానుభవం.. పాలనాదక్షతలను బాగా మార్కెటింగ్‌ చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లోనే రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టామని వివరించారు. ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థ గూగుల్‌ను రాష్ట్రంలోని విశాఖ తీరప్రాంతంలో రూ.1.36 లక్షల కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఒప్పించడానికి తాము పడిన కష్టాన్ని వివరించారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి వద్ద ఆర్సెలార్‌ మిట్టల్‌ రూ.87 కోట్లతో దేశంలోనే అదిపెద్ద స్టీల్‌ ప్లాంట్‌ను స్థాపించనుండడం.. టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలను పెద్దఎత్తున ప్రారంభించేందుకు సిద్ధమవుతుండడాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ప్రాంతాల వారీగా, క్లస్టర్‌ల వారీగా పరిశ్రమల స్థాపనపై రూపొందించిన ప్రత్యేక కార్యాచరణను ఆయా సంస్థల దృష్టికి తీసుకెళ్లారు.


రాష్ట్రంలో గత పాలకుల విధ్వంసక చర్యలపై పెట్టుబడిదారుల్లో నెలకొన్న భయాలను తొలగించడంపైనా లోకేశ్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. 2014-19 నడుమ, 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నెలకొన్న పారిశ్రామిక సానుకూల వాతావరణాన్ని వివరించారు. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రధాని మోదీ వెన్నుదన్నుగా నిలవడాన్ని సోదాహరణంగా వివరించడంలో లోకేశ్‌ సఫలమయ్యారు. ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు అనుమతులు, ముడిఇనుప ఖనిజం కేటాయింపుపై ఆయన స్పందించిన విధానాన్ని తెలియజేశారు. గూగుల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు సందర్భంగా దేశీయ చట్టాలతో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేలా ప్రధాని చొరవతో కేంద్రం చేపట్టిన సవరణలనూ వివరించారు. ఆస్ట్రేలియాలోని ప్రముఖ యూనివర్సిటీల వీసీలు, ప్రొఫెసర్లతో చర్చలు జరిపారు. విద్యతోపాటు క్రీడల రంగంలోనూ సహకారం అర్థించారు. రాష్ట్రంలో క్రికెట్‌ అకాడమీలు, ఉమ్మడి శిక్షణ శిబిరాలు, ఫ్రెండ్లీ మ్యాచ్‌ల నిర్వహణపై దృష్టి సారించాలని కోరారు.


కొత్త భాగస్వామ్యాలపై నమ్మకం

ఏడురోజుల ఆస్ట్రేలియా పర్యటన కొత్త భాగస్వామ్యాలపై నమ్మకం కలిగించిందని మంత్రి లోకేశ్‌ చెప్పారు. పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన ఆయన శనివారం ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. ‘వారం రోజులపాటు ఆస్ట్రేలియాలోని నాలుగు ప్రధాన నగరాల్లో పర్యటించాను. పారిశ్రామికవేత్తలతో భేటీలు జరిగాయని చెప్పారు. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లను పరిశీలించాను. క్రీడలను శక్తిమంతమైన రంగంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో అవకాశాలు చాలా ఉన్నాయని గుర్తించాను. భారత దేశం 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థవైపు దూసుకుపోతున్న ఈ సమయంలో పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ శక్తి బలోపేతం వంటి వాటిపై ఆలోచనలు పంచుకున్నాం’ అని వివరించారు. తన పర్యటన ఫలాలు విశాఖ పారిశ్రామిక సదస్సులో ప్రతిబింబిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

Updated Date - Oct 26 , 2025 | 05:09 AM