Minister Lokesh: పెట్టుబడులే లక్ష్యంగా..
ABN , Publish Date - Dec 03 , 2025 | 04:56 AM
రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ రాకతో కొత్త ఉత్సాహంతో.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి లోకేశ్ అమెరికా, కెనడా పర్యటనలకు సిద్ధమయ్యారు.
6 నుంచి లోకేశ్ విదేశీ పర్యటన
తొలి రోజు డాల్‌సలో ప్రవాసులతో భేటీ
7-9 తేదీల్లో దిగ్గజ సంస్థల అధినేతలతో ‘బిజినెస్ టు బిజినెస్’ సమావేశాలు
11, 12ల్లో కెనడాలో పారిశ్రామికవేత్తలతో భేటీ
వెంట ఉన్నతాధికారుల బృందం
అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ రాకతో కొత్త ఉత్సాహంతో.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి లోకేశ్ అమెరికా, కెనడా పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ నెల 6నుంచి 9వరకూ అమెరికాలో, 11, 12 తేదీల్లో కెనడాలో ఆయన పర్యటిస్తారు. ఆయన వెంట సీఎంవో కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఏపీఈడీబీ సీఈవో శ్రీకాంత్‌వర్మ, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిశోర్ తదితరులు వెళ్తున్నారు. 6న డాల్‌సలో ప్రవాసులతో లోకేశ్ భేటీ అవుతారు. 7 నుంచి 9 వరకు శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్కుల్లో పర్యటిస్తారు. ప్రపంచ శ్రేణి పారిశ్రామిక దిగ్గజ సంస్థల యాజమాన్యాలు, సీఈవోలతో ‘బిజినెస్ టు బిజినెస్’ ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని వివరిస్తారు. 11, 12 తేదీల్లో కెనడాలోని మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలతో సమావేశమవుతారు. ఈ ఏడాది అక్టోబరులో కూడా లోకేశ్ అమెరికాలో పర్యటించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సుస్థిర ప్రభుత్వం, అనుభవజ్ఞుడైన సీఎం చంద్రబాబు నాయకత్వం గురించి పారిశ్రామికవేత్తలకు వివరించారు. విశాఖలో గత నెలలో జరిగిన భాగస్వామ్య సదస్సుకు రావాలని ఆహ్వానించారు. ఆ సందర్భంగా పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ప్రముఖ సంస్థల గురించి.. తాజాగా చేపడుతున్న అమెరికా, కెనడా పర్యటనల్లో తెలియజేస్తారు. వాటి దారిలోనే రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలని బడా కంపెనీలను ఆహ్వానిస్తారు.