Minister Lokesh: శ్రేణుల్లో అసంతృప్తి ఎందుకో తేల్చండి
ABN , Publish Date - Nov 12 , 2025 | 05:03 AM
తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత.. ఈసారి ఇచ్చినన్ని పదవులు గతంలో ఎన్నడూ ఇవ్వలేదు. అయినా పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉంటున్నాయి.
టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్లకు లోకేశ్ ఆదేశం
అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత.. ఈసారి ఇచ్చినన్ని పదవులు గతంలో ఎన్నడూ ఇవ్వలేదు. అయినా పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉంటున్నాయి. దీనికి కారణం ఏమిటో ఆరా తీయండి’ అని పార్టీ జోనల్ సమన్వయకర్తలను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆదేశించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జోనల్ కో-ఆర్డినేటర్లతో ఆయన, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సుమారు 3గంటలపాటు సమావేశమయ్యారు. కార్యకర్తలకు, నేతలకు నడుమ దూరం పెరిగిపోతోందని, తరచూ వారితో మాట్లాడకపోవడం వల్లే వారేం ఏం కోరుకుంటున్నారో నాయకులకు తెలియడం లేదని లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘పార్టీకి కార్యకర్తే అధినేత. ఆ దిశగా ప్రతి కార్యకర్తకూ ప్రాధాన్యం ఉండాలి. కార్యకర్తలకు, ఎమ్మెల్యేలు, మంత్రులకు జోనల్ కో-ఆర్డినేటర్లు వారధిలా పనిచేయాలి. నెలకోరోజు ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమవ్వండి. కార్యకర్తల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించండి’ అని తెలిపారు. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఇన్‌చార్జులు సమన్వయం చేసుకోవడం కీలకమని చెప్పారు. ప్రతినెలా జోనల్ కో-ఆర్డినేటర్లతో సమావేశమై పనితీరు సమీక్షిస్తానన్నారు.
చట్టబద్ధంగా అక్రమ కేసుల పరిష్కారం..
వైసీపీ పెట్టిన అక్రమ కేసులపై సమీక్షించి చట్టపరంగా పరిష్కరిద్దామని లోకేశ్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న పార్టీ పదవులను డిసెంబరు నాటికి భర్తీ చేస్తామని తెలిపారు. అన్ని జిల్లాల్లో పార్లమెంటరీ పార్టీ కార్యాలయాలు, నియోజకవర్గ, మండల స్థాయిలో పార్టీ ఆఫీసుల ఏర్పాటుకు స్థలాలు గుర్తించి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. క్యాడర్‌కు శిక్షణ కార్యక్రమాలను 10 రోజుల్లో ప్రారంభించాలని సూచించారు. లోకేశ్‌తో సమావేశమైన జోనల్ కో-ఆర్డినేటర్లలో బీద రవిచంద్ర, మంతెన సత్యనారాయణరాజు, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, దామచర్ల సత్య, సుజయ్‌కృష్ణ రంగారావు, దీపక్‌రెడ్డి, కోవెలమూడి రవీంద్ర, వేపాడ చిరంజీవిరావు, మందలపు రవి, పెళ్లకూరు శ్రీనివాసరెడ్డి ఉన్నారు.