Share News

Minister Lokesh: ఆధారాలున్నాయ్‌

ABN , Publish Date - Nov 04 , 2025 | 04:01 AM

నకిలీ మద్యం కేసులో ఆధారాలు ఉన్నందునే వైసీపీ నేత జోగి రమేశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారని మంత్రి లోకేశ్‌ స్పష్టంచేశారు.

Minister Lokesh: ఆధారాలున్నాయ్‌

  • అందుకే జోగి అరెస్ట్‌.. కులాన్ని రాజకీయం కోసం వాడతారా?

  • మద్యం ముడుపులు తీసుకోలేదని ఏ దేవుడి ముందైనా ప్రమాణం చేస్తా

  • అలాగే జగన్‌ ప్రమాణం చేస్తారా?

  • విపత్తులు, ప్రమాదాలపై వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాం

  • జగన్‌ బెంగళూరులో ఉంటూ విమర్శలా?.. శ్రీకాకుళం రాలేదేం?: లోకేశ్‌

అమరావతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం కేసులో ఆధారాలు ఉన్నందునే వైసీపీ నేత జోగి రమేశ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారని మంత్రి లోకేశ్‌ స్పష్టంచేశారు. తప్పు చేశారో లేదో చెప్పకుండా కులాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు వైసీపీ ప్రయత్నించడం ఏమిటని నిలదీశారు. సోమవారం ఉండవల్లిలోని నివాసంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్‌, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్‌తో కలసి లోకేశ్‌ మీడియాతో మాట్లాడారు. ‘మా రాజకీయ జీవితంలో మద్యం ముడుపులు తీసుకోలేదని ఏ దేవుడి ముందైనా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అదే తరహాలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ తాను నమ్మిన దేవుడి ముందు లిక్కర్‌ ముడుపులు తీసుకోలేదని ప్రమాణం చేస్తారా?’ నకిలీ మద్యం కుంభకోణం తంబళ్లపల్లెలో మొదలైంది. టీడీపీ నాయకుడిపై కేసు పెడితే ఒకాయన విదేశాలకు వెళ్లిపోయారు. మరొకరు అరెస్టయ్యారు. ఈ కేసులో వైసీపీ నేతలున్నారని తెలిసి కూపీ లాగితే జోగి రమేశ్‌ వ్యవహారం బయటపడింది. రమేశ్‌ మాటలన్నీ రికార్డయ్యాయి. ఈ కేసులో కులాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకునేందుకు ప్రయత్నించడం ఏమిటి?’ అని ప్రశ్నించారు.


జగన్‌ ఎందుకు రాలేదు?

‘‘తప్పు చేస్తే నన్నైనా ముఖ్యమంత్రి చంద్రబాబు చట్టం ముందు దోషిగా నిలబెడతారు. మొంథా తుఫాను, కర్నూలు బస్సు ప్రమాదం, శ్రీకాకుళం జిల్లా ఆలయంలో తొక్కిసలాట.. అన్ని ఘటనల్లోనూ ప్రభుత్వం వెంటనే స్పందించి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. తుఫాను సమయంలో సీఎం, నేను, మంత్రులు సమష్టిగా పనిచేసి ప్రాణ, ఆస్తి నష్ట నివారణ కోసం కష్టపడ్డాం. జగన్‌ బెంగళూరులో ఉంటూ తుఫాను ప్రభావం తగ్గాక తాడేపల్లికి వచ్చి ముఖ్యమంత్రి సృష్టించిన విపత్తుగా విమర్శలు చేయడం ఏమిటి? ఈ మూడు ఘటనలపై అసెంబ్లీలో చర్చకు రావాలంటూ జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్‌ చేస్తే ఎందుకు రావడం లేదు? శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాట సమాచారం తెలియగానే ఎమ్మెల్యే గౌతు శిరీష సహా మంత్రి అచ్చెన్న అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత నేను, మంత్రి అనిత, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కూన రవికుమార్‌ తదితరులంతా బాధితులకు అండగా నిలిచాం. పొరుగునే ఉన్న వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వెంటనే ఎందుకు రాలేదు? జగన్‌ శ్రీకాకుళం జిల్లాలో ఘటానా స్థలికి ఎందుకు వెళ్లలేదు’’ అని లోకేశ్‌ నిలదీశారు. కాగా, ఎమ్మెల్యేల క్రమశిక్షణకు ఇకపై అత్యంత ప్రాధాన్యమిస్తామని లోకేశ్‌ అన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 04:01 AM