Minister Lokesh: టీచర్లకు బోధనేతర పనులుండవు
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:07 AM
ఇక నుంచి ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు ఉండవని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఏపీటీఎఫ్ నేతలు చెన్నుపాటి మంజుల, పి.పాండురంగ...
423లో 200 సమస్యలు పరిష్కరించాం
సర్వీస్ రూల్స్‌ను డీఈఓ,ఎంఈవోలకు అప్పగించం
ఏపీటీఎఫ్ నేతలతో మంత్రి లోకేశ్
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): ఇక నుంచి ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు ఉండవని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఏపీటీఎఫ్ నేతలు చెన్నుపాటి మంజుల, పి.పాండురంగ వరప్రసాద్‌లతో శుక్రవారం ఉండవల్లిలోని నివాసంలో ఆయన సమావేశమయ్యారు. ‘టీచర్ల సమస్యలపై మా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అభ్యసన ఫలితాల కోసం వారు కృషి చేయాలి. గత 17 నెలల్లో ఫ్యాప్టో 423 సమస్యలను నా దృష్టికి తీసుకొస్తే అందులో 200 పరిష్కరించా. 81 సమస్యలు పరిష్కార యోగ్యమైనవి కావు. 72 వినతులు విధానపరమైన అంశాలు. మరో 71 సమస్యలు కోర్టు పరిధిలో ఉన్నాయి. మెగా పీటీఎం మినహా టీచర్లకు ఇంకెలాంటి బోధనేతర పనులు ఉండవు. డీఈవోలు, ఎంఈవోలకు సర్వీస్ రూల్స్ అంశాలు అప్పగించం’ అని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. కాగా ఇన్ సర్వీస్ టీచర్లకు సాధారణ టెట్ నుంచి మినహాయింపునివ్వాలని, వారికి ప్రత్యేకంగా టెట్ నిర్వహించి కటాఫ్ మార్కులను 45 శాతానికి తగ్గించాలని ఏపీటీఎఫ్ నేతలు కోరారు. 2003కు ముందు సర్వీసులో చేరిన టీచర్లకు పాత పెన్షన్ స్కీం వర్తింపజేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు మీడియంను కొనసాగించాలని, ప్రాథమిక తరగతులను ఉన్నత పాఠశాలల నుంచి వేరు చేయాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్లను కాకుండా ప్రధానోపాధ్యాయులను ఎంఈవోలుగా నియమించాలన్నారు.