Share News

Minister Lokesh: అభివృద్ధిలో వేగం

ABN , Publish Date - Sep 18 , 2025 | 03:34 AM

సమర్థ నాయకత్వం, ప్రభుత్వ నిర్ణయాల్లో వేగం, యువ నేతల ఉత్సాహంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి లోకేశ్‌ చెప్పారు. స్పీడ్‌ ఆఫ్‌ బిజినెస్‌ను స్లోగన్లకే పరిమితం చేయకుండా...

Minister Lokesh: అభివృద్ధిలో వేగం

  • ఏపీలో సానుకూల వాతావరణం.. సమర్థ నాయకత్వంతో ముందుకు

  • చంద్రబాబు వల్లే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు

  • చేతల్లో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌.. అమరావతిలో క్వాంటమ్‌ వ్యాలీ

  • విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్‌.. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం

  • ఏపీ-యూకే బిజినెస్‌ ఫోరం రోడ్‌షోలో లోకేశ్‌.. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): సమర్థ నాయకత్వం, ప్రభుత్వ నిర్ణయాల్లో వేగం, యువ నేతల ఉత్సాహంతో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి లోకేశ్‌ చెప్పారు. స్పీడ్‌ ఆఫ్‌ బిజినెస్‌ను స్లోగన్లకే పరిమితం చేయకుండా చేతల్లో చూపుతున్నామన్నారు. ఈ ఏడాది నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు జరగనున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి లండన్‌లో ఏపీ-యూకే బిజినెస్‌ ఫోరం రోడ్‌షో జరిగింది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌, పాల్‌మాల్‌ కన్వెన్షన్‌ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టెక్‌-మహీంద్రా యూరప్‌ బిజినెస్‌హెడ్‌ హర్షుల్‌ అస్నానీ సంధానకర్తగా వ్యవహరించారు. ప్రముఖ కంపెనీలైన హిందూజా గ్రూప్‌, రోల్స్‌ రాయిస్‌, అపోలో టైర్స్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌, కోవెంట్రీ యూనివర్సిటీ ప్రతినిధులతో లోకేశ్‌ ద్వైపాక్షిక చర్చలు చేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా సీఐఐ ఆధ్వర్యంలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తున్నామని లోకేశ్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ పార్టనర్స్‌తో రోడ్‌షోలను నిర్వహిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో లోకేశ్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘‘గడిచిన 15 నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థనాయకత్వం వల్ల రూ. 10 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ వేగంగా అభివృద్ధి చెందడానికి మూడు కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది, గట్టి ట్రాక్‌ రికార్డు ఉన్న లీడర్‌షిప్‌. రాష్ట్రానికి సుస్థిరమైన నాయకత్వం. చంద్రబాబు క్రెడిబిలిటీ, లీడర్‌షిప్‌ క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచమంతటికీ ఆయన సమర్థనాయకత్వం గురించి తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు కొత్త రాష్ట్రాన్ని కూడా అదేతరహాలో అభివృద్ధి చేస్తున్నారు.


పెద్ద సంస్థలను రప్పించాం

రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందడానికి రెండో కారణం.. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ అమలు. ప్రాజెక్టు ఆరునెలలు ఆలస్యమైతే మొత్తం బిజినెస్‌ ప్లాన్‌ దెబ్బతింటుంది. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను మాటల్లోనే కాకుండా చేతల్లో అమలు చేస్తున్నామన్న సంకేతాలను ప్రపంచానికి ఇస్తున్నాం. భారత్‌లో అతి పెద్ద ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీట్‌ప్లాంట్‌ రాష్ట్రంలో ఏర్పాటు కాబోతోంది. ప్రతిపాదనలపై చర్చల సమయంలో ఆ స్టీల్‌ ప్లాంట్‌ మూడు ప్రధానాంశాలను ప్రభుత్వం ముందుంచింది. వాటిని కేవలం పన్నెండు గంటల్లోనే పరిష్కరించాం. ఈ నవంబరు నుంచే ఆర్సెలార్‌ స్టీల్‌ ప్లాంట్‌ పనులు ప్రారంభం కాబోతున్నాయి. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ విశాఖకు త్వరలోనే రాబోతోంది. టీసీఎస్‌ లాంటి పెద్ద సంస్థలను రప్పించడం ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠను పెంచేందుకే ఎకరా 99 పైసల చొప్పున ఇస్తున్నాం.


అభివృద్ధి తపనతో యువనాయకత్వం

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగవంతం కావడానికి ఉత్సాహంగా పనిచేసే యువ నాయకత్వం మూడో కారణం. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా 50 శాతం మంది గెలిచారు. మంత్రివర్గంలోని 25 మందిలో 17 మంది కొత్తవారే. రాష్ట్రం స్టార్టప్‌ స్టేజ్‌లో ఉన్నందున.. వారందరిలోనూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలన్న తపన ఉంది. విజనరీ లీడర్‌ చంద్రబాబు అధ్యక్షతన పారిశ్రామిక సంస్థలతో అవగాహన ఒప్పందాలతోనే సరిపుచ్చకుండా ప్రాజెక్టులన్నింటినీ వాస్తవ రూపంలోకి తీసుకొచ్చి ఉత్పత్తి చేపట్టేలా చర్యలు చేపడుతున్నాం. రాబోయే ఐదేళ్లలో పారిశ్రామికరంగంలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. యువతకు ఉద్యోగాల కల్పనే తమ ప్రభుత్వ ధ్యేయం.


సాంకేతిక ప్రగతి ముఖచిత్రం మారుతోంది

దక్షిణాసియాలో తొలి 158 బిట్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌ జనవరిలో అమరావతికి రాబోతుంది. ప్రధాని మోదీ ప్రారంభించిన క్వాంటమ్‌ మిషన్‌ను ముందుండి నడిపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. దీని ద్వారా అమరావతిలో అద్భుతమైన ఎకో సిస్టమ్‌ ఏర్పాటు కాబోతోంది. విశాఖలో డేటా సిటీ నిర్మాణంతో అక్కడ కేబుల్స్‌ ల్యాండ్‌ అవుతాయి. ముంబై కన్నా రెట్టింపు సామర్థ్యంతో 1.5 గిగావాట్‌ డేటా సెంటర్‌ విశాఖలో ఏర్పాటు కాబోతోంది. రాబోయే మూడేళ్లలో ఆ పనులన్నీ పూర్తవుతాయి. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. ఇవన్నీ ఫలప్రదమైతే.. రాష్ట్ర సాంకేతిక ప్రగతి రూపురేఖలు సమూలంగా మారిపోతుంది. క్వాంటమ్‌ వ్యాలీ, డేటా సిటీలతో ఆంధ్రప్రదేశ్‌ ఐటీ ముఖచిత్రం ప్రపంచస్థాయికి చేరుకుంటుంది. ఐటీ విప్లవంతో భారతదేశం లబ్ధి పొందింది. ఏపీ బలపడింది. కృత్రిమ మేధ ద్వారా వచ్చే అవకాశాలు అందిపుచ్చుకునేందుకు స్కిల్‌ అప్‌గ్రేడేషన్‌ను అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఏఐ గేమ్‌ చేంజర్‌ కాబోతోంది. పారిశ్రామిక ప్రగతికి అవసరమైన సాంకేతిక నైపుణ్యాలతో కూడిన పాఠ్యాంశాలను విద్యలో అమలు చేస్తున్నాం. విజన్‌-2047 లక్ష్యంతో ప్రధానమైన 2.4లక్షల ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి చేరుకోవడానికి ఏటా 15 శాతం వృద్ధి రేటు సాధించాలి. ఈ దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. మాప్రయాణంలో ప్రపంచ భాగస్వాములను జత చేసుకుంటున్నాం. స్పేస్‌ సిటీ నిర్మించబోతున్నాం.’’ అని వెల్లడించారు. ఎరిక్సన్‌, సియెంట్‌, ఇవాంటే గ్లోబల్‌,ఏఐ ఓపెన్‌సెక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాతో పాటు అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫాక్చరింగ్‌, ఫైనాన్స్‌, ఇంధన, టెక్నాలజీ, లండన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


మోదీకి సీఎం జన్మదిన శుభాకాంక్షలు

లండన్‌ ఇస్కాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన లోకేశ్‌

అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంపూర్ణ ఆరోగ్యంతో మరికొన్ని సంవత్సరాలు దేశానికి సేవ చేయాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. బుధవారం మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధానికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. వికసిత్‌ భారత్‌ కోసం మోదీ కృషి శ్లాఘనీయమన్నారు. కాగా, ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా మంత్రి లోకేశ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. లండన్‌ పర్యటనలో ఉన్న లోకేశ్‌ అక్కడ ఇస్కాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మోదీ మార్గదర్శకత్వంలో వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు.

Untitled-4 copy.jpg

Updated Date - Sep 18 , 2025 | 03:42 AM