Share News

Minister Lokesh: 150 కేసులు వేసినా...150 రోజుల్లోనే మెగా డీఎస్సీ పూర్తి

ABN , Publish Date - Sep 26 , 2025 | 08:19 AM

150 కేసులు పెట్టినా కూడా 150 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి చేయడం ఒక చరిత్ర అని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో...

Minister Lokesh: 150 కేసులు వేసినా...150 రోజుల్లోనే మెగా డీఎస్సీ పూర్తి

డీఎస్సీ ఫైల్‌ పైనే తొలి సంతకమని అప్పుడే చెప్పా

ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌ను ప్రపంచానికి చూపిద్దాం

నాన్న చంద్రబాబే నా లైఫ్‌ టైం గురువు

నవంబరులో మళ్లీ టెట్‌ నిర్వహిస్తాం: మంత్రి లోకేశ్‌

అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): 150 కేసులు పెట్టినా కూడా 150 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి చేయడం ఒక చరిత్ర అని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘యువగళం పాదయాత్రలో నిరుద్యోగ యువతతో మాట్లాడేవాడిని. అప్పుడే మెగా డీఎస్సీ ఆలోచన మొదలైంది. సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీపైన పెడతారని అప్పుడే చెప్పాను’’ అని మంత్రి తెలిపారు. ‘‘దేశానికి అధినేత అయినా ఒక గురువు దగ్గర చదువుకున్న విద్యార్థే. నాకు లైఫ్‌ టైం గురువు మా నాన్న సీఎం చంద్రబాబు. మిమ్మల్ని చూస్తుంటే నా టీచర్లు గుర్తొచ్చారు. స్కూల్లో మంజులా మేడం కొట్టిన దెబ్బలు, రమాదేవి మేడం నేర్పిన డిసిప్లిన్‌, ఇంటర్‌లో నారాయణ మాస్టారు బ్రిడ్జ్‌ కోర్సు పాఠాలు, అమెరికాలో ప్రొఫెసర్‌ రాజిరెడ్డి మార్గదర్శకత్వం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రపంచంలో ఏ రంగంలో ఉన్నవారైనా, ఎంత గొప్పవారైనా తమ టీచర్లను గౌరవిస్తూనే ఉంటారు’’ అని లోకేశ్‌ చెప్పారు. ‘‘సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం. నవంబరులో టెట్‌ చేపడతాం. వచ్చే ఏడాది మళ్లీ పారదర్శకంగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తాం’’ అని ఆయన ప్రకటించారు. ‘రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో మాకు మూడు తరాలు డీఎస్సీ ప్రకటించే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్‌, చంద్రబాబు తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.


విద్యారంగాన్ని రాజకీయాలకు అతీతంగా ఉంచేందుకు పలు కీలకమైన సంస్కరణలు తెచ్చాం. సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో విద్యార్థి మిత్ర, డొక్కా సీతమ్మ గారి పేరిట మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నాం. ప్రాథమిక విద్యలో నాణ్యత పెంచేందుకు 9,600 స్కూళ్లలో వన్‌ క్లాస్‌- వన్‌ టీచర్‌ విధానాన్ని తెచ్చాం. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావును క్యాబినెట్‌ ర్యాంకుతో సలహాదారుగా నియమించాం. విద్యార్థులకు పుస్తకాల బరువు తగ్గించాం.. శనివారం నో బ్యాగ్‌ డే అమలు చేస్తున్నాం’’ అని లోకేశ్‌ తెలిపారు. ‘‘టీడీపీ విద్యకు ఎప్పుడూ తొలి ప్రాధాన్యం ఇస్తుంది. సీబీఎన్‌ అంటే డీఎస్సీ. ఇప్పటివరకూ 14 డీఎస్సీలు నిర్వహించి 2 లక్షల టీచరు పోస్టులు భర్తీ చేశాం. ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత నిర్వహించిన మొదటి డీఎస్సీలోనే అమలు చేశాం. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి అత్యధికంగా డీఎస్సీలో 49.9ు పోస్టులను మహిళలు దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నూతన ఉపాధ్యాయులంతా పట్టుదల, నిబద్ధతతో పనిచేసి విద్యావ్యవస్థలో మార్పుతేవాలి. సమష్టి కృషితో ప్రభుత్వ విద్యావ్యవస్థను దేశానికే దిక్సూచిగా మారుద్దాం. ఏపీ మోడల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కోసం కలసికట్టుగా కృషిచేద్దాం. విద్య అంటే ఫిన్‌ ల్యాండ్‌, డిల్లీ మాత్రమే కాదు. ప్రపంచానికి ఆంధ్రా మోడల్‌ చూపిద్దాం’’ అని లోకేశ్‌ పిలుపునిచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్‌ల్యాండ్‌, సింగపూర్‌ అధ్యయనానికి పంపించాలని సీఎంకు లోకేశ్‌ విన్నవించారు.

Updated Date - Sep 26 , 2025 | 08:24 AM