AP MSMEs Get Support From Germany: ఏపీ ఎంఎస్ఎంఈలకు అండగా జర్మనీ..
ABN , Publish Date - Nov 25 , 2025 | 09:35 PM
మంగళవారం చెన్నైలోని హిల్టన్ హోటల్‌లో జరిగిన ఇండో - జర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్ 59వ వార్షిక ప్రాంతీయ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను అందించేందుకు చర్యలు చేపడుతోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం చెన్నైలోని హిల్టన్ హోటల్‌లో జరిగిన ఇండో - జర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్ 59వ వార్షిక ప్రాంతీయ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు.
ఇండో జర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్ 2025 నవంబర్ 25న చెన్నైలోని హోటల్ హిల్టన్‌లో ఇండో-జర్మన్ సహకారాన్ని బలోపేతం చేసే ఒప్పందంపై అధికారులు సంతకం చేశారు. సుమారు 200 మంది జర్మన్ కంపెనీల సీఈఓలు, సీఎఫ్ఓలు, తదితర ప్రముఖులు హాజరైన ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ఉన్న అన్ని అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్దికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్దంగా ఉందని తెలిపారు.
నూతన పారిశ్రామిక విధానాన్ని స్నేహపూర్వక కోణంలో ఉండే విధంగా తీసుకురావడం జరిగిందని, మౌలిక సదుపాయాల కల్పనకు ఎంఎస్ఎంఈ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెడీ టూ ఇన్స్టాల్ పద్దతిలో పార్క్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు వ్యూహాత్మక గమ్యస్థానంగా అభివర్ణించారు. నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, సహజ వనరులు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రం స్వాగతం పలుకుతోందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - ఇండో-జర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్ మధ్య లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై ఇరు పక్షాల అధికారులు సంతకాలు చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ఎంఎస్ఎంఈలకు సంబంధించి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ఎగుమతులపై అవగాహన, ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా వాడుకలో ఉన్న వస్తువుల తయారీ, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఎంఎస్ఎంఈ పార్క్‌లలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాల కల్పన సహా పలు అంశాలపై జర్మనీ సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈఓ విశ్వ మనోహరన్, ప్రధాన సాంకేతిక సలహాదారు డాక్టర్ ఎం. శ్రీనివాస్ శంకర్ ప్రసాద్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, దక్షిణ ప్రాంతీయ మండలి, ఇండో జర్మన్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రంజిత్ ప్రతాప్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి
నెక్కొండ మున్సిపాలిటీకి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్..
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరిగేలా కౌన్సిలింగ్..